మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం టీడీపీ నేతల దౌర్జన్యం | Atrocity Of TDP Leaders For Mid Day Meal Agency In AP, More Details Inside | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం టీడీపీ నేతల దౌర్జన్యం

Jul 5 2024 5:27 AM | Updated on Jul 5 2024 10:30 AM

Atrocity of TDP leaders for mid day meal agency

అనంతపురం జిల్లా, ఛాయాపురంలో ఏజెన్సీ నిర్వాహకురాలిపై దాడి

మనస్తాపంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం

వజ్రకరూరు: అధికారం అండగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అంతా తాము చెప్పినట్టే జరగాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వా­హకురాలిపై టీడీపీ నేతలు దౌర్జ్యనం చేశారు. దీంతో ఆమె క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఛాయాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో గత 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని బోయ సుంకమ్మ నిర్వహిస్తున్నారు. 

ఆమెకు సహాయకురాళ్లుగా ఆమె కుమార్తెలు రాధ, లక్ష్మి ఉన్నారు. ఇన్నేళ్లలో వారిపై చిన్న ఫిర్యాదు కూడా అందలేదు. కానీ గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు ఏజెన్సీ కోసం బోయ సుంకమ్మను బెదిరింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కూడా తమ పార్టీ కార్యకర్తలే చూసుకుంటారని అందువల్ల స్వచ్ఛందంగా తప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. 

కానీ అధికారికంగా తనకు ఎవరూ ఏజెన్సీ నిర్వహించవద్దని చెప్పకపోవడంతో బోయ సుంకమ్మ ఎప్పటిలాగే చిన్నారులకు మధ్యాహ్న భోజనం వండుతోంది. ఈ క్రమంలో గురువారం పాఠశాల వద్దకు వెళ్లిన కొందరు టీడీపీ నాయకులు సుంకమ్మపై మరోసారి దౌర్జన్యానికి దిగారు. 

చెబితే వినవా... 
‘ఒక్కసారి చెబితే నువ్వు వినవా.. ఏజెన్సీ నుంచి తప్పుకోకపోతే నీ అంతు చూ­స్తాం’ అంటూ హెచ్చరించారు. దీంతో సుంకమ్మ అది చెప్పేందుకు మీరెవరని ప్రశ్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేతలు వంట గదిలోని సామగ్రి, కూరగాయలు తీసుకువచ్చి రోడ్డుపై పడేశారు. అడ్డుకోబోయిన సుంకమ్మ కూతురు రాధ, మనుమడు దొరబాబు, మనుమరాలిని పక్కకు నెట్టివేశారు. దీంతో మనస్తాపం చెందిన సుంకమ్మ వంటగదిలోకి వెళ్లి క్రిమి సంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. 

దీన్ని గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను 108లో గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వజ్రకరూరు ఎస్‌ఐ నరేష్‌ ఆస్పత్రికి వెళ్లి సుంకమ్మ నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే మండల విద్యాధికారి తిమ్మప్ప కూడా ఆమెను పరామర్శించి వివరాలు సేకరించారు. 

కాగా అదే పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్‌ మహేశ్వరిని కూడా టీడీపీ నేతలు బెదిరించా­రు. ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవాలంటూ టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తు­న్నట్టు స్వీపర్‌ మాముడూరు మహేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగం వదిలేస్తే తన కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement