అనంతపురం: వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ చెల్లించాలని తదితర డిమాండ్ల సాధన కోసం విజయవాడలో ఆందోళన చేపట్టిన అంగన్‌వాడీ కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలపై చర్చలకు పిలుస్తామని తెల్లవారుజామున శిబిరాల్లోకి దూరి మగ పోలీసులతో దాడులు చేయిస్తారా.. మహిళలని కూడా చూడకుండా లాఠీచార్జ్ చేయడమేంటి? అంటూ మండిపడ్డారు. లాఠీచార్జ్ సమయంలో అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబిరాణికి గాయాలవడం దురదృష్టకరమన్నారు. అంగన్‌వాడీల అరెస్టును వైఎస్సార్‌సీపీ ఖండిస్తోందన్నారు. గతంలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరితే గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు.. సీఎం అయ్యాక తొలి ఏడాది ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు. హామీలపై నిలదీస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రశ్నించిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
భృతి.. అంతా భ్రాంతి
సూపర్ సిక్స్ హామీల్లో నిరుద్యోగ భృతి ఇప్పటి దాకా అమలు చేయలేదని, నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారని అనంత విమర్శించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 అందిస్తామన్నారని, 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తామని చెప్పి రెండేళ్లయినా అమలు చేయలేదన్నారు. ఇక ఉద్యోగులకు ఒక డీఏతో సరిపెట్టి.. ఐఆర్ ఇవ్వకుండా, పీఆర్సీ కమిటీ వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదన్నారు. పోలీస్‌శాఖలో కొందరు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
పరిశ్రమలు పోతున్నాయ్
అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో పరిశ్రమ స్థాపనకు 121 ఎకరాలను జిన్ ఫ్రా కంపెనీకి కేటాయించారని, శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌కు 70 ఎకరాలు కేటాయించారని అనంత తెలిపారు. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కమీషన్లు ఇవ్వలేక ప్రభుత్వం ఇచ్చిన భూములు సైతం వద్దనుకుని వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రెండేళ్లుగా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్
సీఎం చంద్రబాబు అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేశారని అనంత విమర్శించారు. 2014 – 2019 వరకు రాజధాని పేరుతో ఎలాంటి అభివృద్ధీ చేయలేదన్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే లీకులు ఇచ్చి తనకు కావాల్సిన వాళ్లు భూములు కొనుగోలు చేసుకునేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. ఈ 21 నెలల్లో ఏకంగా 47 వేల కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పు చేశారన్నారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అనువుకాని ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టడం మాత్రం తప్పు అని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, కల్చరల్ విభాగం నగరాధ్యక్షుడు కేశవ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు అంజి పాల్గొన్నారు.
అంగన్‌వాడీలకిచ్చిన హామీలు ఏమయ్యాయి?
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి


