గుంతకల్లు: రన్నింగ్ రైలులో ప్రయాణికురాలి బంగారు గొలుసును లాక్కుని దుండగుడు ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన సౌందర్య, జీవన్ దంపతులు ఏడాది వయస్సు గల కూతురుతో కలిసి మంగళవారం రాత్రి జైపూర్ నుంచి మైసూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ (12796) రైలులో (ఎస్–2 కోచ్) బెంగళూరుకు బయలుదేరారు. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో గుంతకల్లు సమీపంలోని మల్లప్పగేట్ రైల్వేస్టేషన్ వద్ద నిదానంగా వెళ్తోంది. అదే సమయంలో సౌందర్య తన కుమార్తెకు పాలు పడుతోంది. రైలులోనే ప్రయాణిస్తున్న ఓ దుండగుడు ఇదే అదనుగా భావించి సౌందర్య మెడలోని 3 తులాల బంగారు తాళిబొట్టు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేస్తూ గొలుసును చేత్తో పట్టుకుంది. దీంతో అటువైపు నుంచి బలంగా లాగడంతో సగం బంగారు గొలుసు చేతికి రాగానే దుండగుడు కదులుతున్న రైలులోంచి కిందకు దూకి పారిపోయాడు. బాధితురాలు గుంతకల్లులో జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
శఠగోపం దొంగలు దొరికారు
బుక్కరాయసముద్రం: భక్తుని ముసుగులో వచ్చి శఠగోపం తస్కరించుకుపోయిన దొంగలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌లో సీఐ పుల్లయ్య, ఎస్‌ఐ రాంప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఫిబ్రవరి 25న చెరువుకట్టపైనున్న షిర్డీసాయిబాబా ఆలయంలో దర్శనం కోసం వచ్చిన వ్యక్తి మూడు ప్రదక్షిణలు చేసి.. శఠగోపానికి మొక్కి మరీ తన బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయాడు. ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో సీఐ పుల్లయ్య, ఎస్‌ఐ రాం ప్రసాద్ సీసీ టీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ముసలమ్మ కట్ట వద్ద వెళ్తున్న ఓ ఆటోను ఆపి.. పరిశీలించగా సాయిబాబా ఆలయ శఠగోపం కనిపించింది. ఆటోను, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. తమదైన శైలిలో విచారించగా అనంతపురం సాయినగర్‌కు చెందిన కుణుతూరు మహేశ్వరరెడ్డి, రెండో రోడ్డుకు చెందిన బళ్లారి షానవాజ్ బాషా శఠగోపం చోరీకి పాల్పడినట్లు తేలింది. నిందితులిద్దరినీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.


