అనంత: గప్‌చుప్‌గా నల్లపూసల దండ మింగేసిన భర్త.. 3 నెలలకు కడుపులోని ఆ రహస్యం..

Anantapur Crime: Husband Swallow Wife Nallapusalu Danda - Sakshi

అనంతపురం క్రైం: క్షణికావేశంలో ఓ వ్యక్తి తన భార్య నల్లపూసల దండ మింగేశాడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆ రహస్యాన్ని కడుపులోనే దాచుకున్నాడు. చివరకు కడుపునొప్పి తీవ్రం కావడంతో వైద్యులను సంప్రదించగా, అనంతపురం సర్వజనాస్పత్రి ఈఎన్‌టీ విభాగం వైద్యులు ఎలాంటి ఆపరేషన్‌ లేకుండానే నల్లపూసల దండను నేర్పుగా బయటకు తీసి అతడికి పునర్జన్మ ప్రసాదించారు.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన రామాంజనేయులు (45) మూడు నెలల క్రితం తన భార్య నల్లపూసల దండను(బంగారం కాదు)మింగేశాడు. ఇటీవల కడుపు నొప్పి తీవ్రం కావడంతో విషయం కుటుంబీకులకు చెప్పాడు. దీంతో వారు అతడిని అనంతపురంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూపించారు. రూ.వేలల్లో ఖర్చవుతుందని వై­ద్యులు చెప్పడంతో మే 29న ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకురాగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుకుమార్‌ రామాంజనేయులును పరీక్షించారు. వివరా­లు ఆరా తీయగా, తాను చైన్‌ను మింగానని, ఏదైనా ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో వైద్యుడు ఎక్స్‌రేకి రిఫర్‌ చేశాడు.

రామాంజనేయులు అన్నవాహిక వద్ద నల్లపూసల దండ డాలర్‌ ఇరుక్కుని, దండ కడుపులోని ఈసోఫాగస్‌ (ఫుడ్‌పైప్‌) వరకు వెళ్లినట్లు  కనిపించింది. దీంతో వైద్యులు అతడిని అడ్మిట్‌ చేసుకుని ఆపరేషన్‌ లేకుండానే కడుపులో ఉండిపోయిన నల్లపూసల దండ బయటకు తీయాలని నిర్ణయించారు. మే 30న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ సుకుమార్, డాక్టర్‌ కృష్ణ సౌమ్య, స్టాఫ్‌నర్సులు, అనస్తీషియా వైద్యుడు డాక్టర్‌ వేమానాయక్, ఓటీ టెక్నీషియన్‌ రాజేష్‌లు రామాంజనేయులు అన్నవాహికకు మత్తు మందు ఇచ్చారు.

ఫ్లెక్సిబుల్‌ గ్యాస్ట్రో ఎండోస్కోపీ ద్వారా నల్లపూసల దండను తొలగించారు. రామాంజనేయులు ఆరోగ్యంగా ఉన్నట్లు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుకుమార్‌ తెలిపారు. శస్త్ర చికిత్స లేకుండా కడుపు లోపల ఉన్న నల్లపూసల దండను బయటకు తీసిన వైద్యులను జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌ అభినందించారు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top