అంతా క్షణాల్లోనే.. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం | Sakshi
Sakshi News home page

అంతా క్షణాల్లోనే.. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం

Published Wed, Jan 11 2023 9:04 AM

6 People Died Road Accident Going To Visit Vemulawada Rajanna - Sakshi

సాక్షి, గజ్వేల్‌/జగదేవ్‌పూర్‌: వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని వస్తున్నామనే సంతోషం.. వారిలో కొద్ది గంటలు కూడా నిలవలేదు. మూలమలుపు దాటేవరకు సజావుగానే సాగిన ప్రయాణానికి మృత్యువు కాపుగాసిందన్న విషయం తెలియకుండానే పైలోకాలకు వెళ్లిపోయారు. అతివేగం ఆరుగురి ప్రాణాలను బలిగొన్నది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. యాదాద్రి–భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రానికి చెందిన బొల్లు సమ్మయ్య స్టీల్‌ సామాన్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య స్రవంతి కూడా చేదోడువాదోడుగా ఉంటుంది.

వీరికి కూతురు భవ్య, కుమారుడు కార్తీక్‌ అలియాస్‌ లోకేష్‌ ఉన్నారు. అదే గ్రామంలోని మాంటిస్సోరి పాఠశాలలో భవ్య, ఏడో తరగతి, లోకేష్‌ 5వ తరగతి చదువుతున్నారు.  సమ్మయ్య తన కుటుంబ సభ్యులతో పాటు బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన అత్తమామ రాజమణి–బిట్టు వెంకటేష్‌తో కలిసి రాజన్న దర్శనం చేసుకున్నాడు. మంగళవారం తిరిగి వస్తుండగా, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండల పరిధిలోని మునిగడప వద్ద  కాల్వలోకి కారు బోల్తా కొట్టిన ఘటనలో మృత్యువాత పడ్డారు.  

మూలమలుపు దాటాక.. 
ప్రమాద ఘటనలో అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తొంది.  గ్రామంలోని ఎల్లమ్మగుడి వద్ద నిజానికి ప్రమాదకరమైన మూలమలుపు ఉంది. సహజంగా అక్కడ ప్రమాదాలు జరగడం పరిపాటి. కానీ ఈ మలుపు  దాటిన కొద్ది క్షణాలకే కారు అదుపు తప్పింది. డ్రైవింగ్‌ చేస్తున్న సమ్మయ్య అజాగ్రత్త వహించాడా? వేరే కారణాలున్నాయా?  అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొండపోచమ్మసాగర్‌ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌పై నిర్మించిన కల్వర్టును ఎడమ వైపున ఢీకొట్టిన కారు,  అదుపుతప్పి మరింత వేగంతో కుడివైపునకు వెళ్లి అక్కడ మట్టిగడ్డను దాటి కెనాల్‌లో పడిపోయింది.

ఈ క్రమంలో కెనాల్‌ పైభాగంలో ఉన్న మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ను బలంగా తాకి  గుంతలోకి తలకిందులుగా పడిపోయింది. ఆలయాల సందర్శనకు వెళ్లివస్తున్నప్పుడు సహజంగా మధ్యలో ఆగి దావత్‌లు చేసుకోవడం పరిపాటి. అంతేగాకుండా దైవదర్శనం సందర్భంలో నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం చూస్తుంటాం. తాజా ప్రమాదంలో ఈ రెండు కారణాలు కూడా ప్రభావం చూపాయా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవే కాకుండా మృతులు ప్రయాణించిన కారు కండిషన్‌ సక్రమంగా లేకపోవడం, అందులో ఆరుగురు ఇరుకుగా కూర్చోవడం కూడా ప్రమాదానికి మరో కారణంగా భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పారిశుధ్య కార్మికులు గమనించి హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు.మృతదేహాలను వెలికి తీయడంలో కీలకంగా వ్యవహరించారు.  

రోజువారి కూలీలే..  
ప్రమాదంలో మృతి చెందిన వెంకటేష్, రాజమణి దంపతులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. కాగా వీరి పూర్వీకులు గ్రామాల్లో భాగవతం ఆడేవారు. వీరు రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. రాజమణి గంపలో గాజులు, స్టీల్, ప్లాస్టిక్‌ సామాన్లు ఇంటింటికి అమ్ముతూ ఉండగా, వెంకటేష్‌ గ్రామంలో ఎక్కడైన కూలి లభిస్తే వెళ్లేవాడు. లేని పక్షంలో బొమ్మలరామారం మండలంతో పాటు సమీప మండలాల్లో భాగవతం పాటలు పాడుతూ భిక్షాటన చేసేవాడు. అందరితో కలిసిమెలసి ఉండే ఈ దంపతులు ప్రమాదంలో మృతి చెందడంతో మల్యాల గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 

ఆ ఇంట తీరని శోకం 
తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యుల బాధ వర్ణణాతీతంగా ఉంది. రాజమణి –వెంకటేష్‌ దంపతులకు కూతుళ్లు స్రవంతి, విజయ, కొడుకు  శ్రీకాంత్‌ ఉన్నారు. పెద్ద కూతురు స్రవంతి కుటుంబమంతా మృతి చెందగా,  విజయకు గోదావరిఖని చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొడుకు శ్రీకాంత్‌ ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. 

కలిసిరాని సెంటిమెంట్‌
బీబీనగర్‌లోని దాసరి కుటంబాలకు చెందిన వారంతా ప్రతీ ఏడాది వారి ఆరాధ్య దైవమైన వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. రాజన్నను సోమవారం మాత్రమే దర్శించుకోవడం వీరికి సెంటిమెంట్‌. సమ్మయ్య కుటుంబం  ఈ సంవత్సరం కూడా సోమవారమే రాజన్న దర్శనానికి వెళ్లగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయం వారి బంధువులకు తెలియడంతో బీబీనగర్, బొమ్మలరామారం, మల్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

ఫోన్‌రాగానే గుండె పగిలింది 
‘నిన్న మధ్యాహ్నం తర్వాత మా అమ్మనాన్న, బావ, అక్క పిల్లలతో కలిసి వేములవాడ పోయిండ్రు. మొక్కులు తీర్చుకొని ఇయ్యాల 12 గంటలకు బయలుదేరుతున్నమని నాకు ఫోన్‌ చేసి చెప్పిండ్రు. సాయంత్రం 4 గంటల తర్వాత జగదేవ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీవాళ్లకు యాక్సిడెంట్‌ అయ్యిందని చెప్పడంతో ఒక్కటేసారి గుండె పగిలినట్టయింది’. అంటూ మృతుడు వెంకటేష్‌ కుమారుడు శ్రీకాంత్‌ రోదించాడు.  తన తండ్రిని గజ్వేల్‌ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించే క్రమంలో మాట్లాడారు. 

(చదవండి: ప్రమాదమా.. తగలబెట్టారా?)

Advertisement
 
Advertisement
 
Advertisement