breaking news
vemulawada rajanna
-
దేవుడి కోడెలకు మరణశాసనం!
సాక్షి, హైదరాబాద్: భక్తులు దేవుడికి సమర్పించిన కోడెలను సంరక్షించాల్సిన దేవాదాయ శాఖ వాటికి మరణశాసనం లిఖిస్తోంది. కొందరు అధికారుల నిర్లక్ష్యం, చేతివాటం ఫలితంగా కొన్ని రోజులుగా రోజుకు 8 నుంచి 10 కోడెలు ప్రాణాలు వదులుతున్నాయి. దీనిపై ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్థానిక యంత్రాంగం చేతులెత్తేసింది. చనిపోయిన కోడెలను ఖననం చేయటం తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేకపోతోంది.భక్తుల ఆనవాయితీని సొమ్ము చేసుకుంటూ.. మరే దేవాలయంలో లేని ఓ ఆనవాయితీ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో ఉంది. కోరికలు నెరవేరిన భక్తులు దేవుడి మొక్కు కింద కోడె (ఎద్దు)లను ఆలయానికి సమర్పించడం ఏళ్లుగా కొనసాగుతోంది. ఇలా పొందిన కోడెల సంరక్షణకు ఆలయం రెండు గోశాలలను నిర్వహిస్తోంది. గతంలో కోడెలను వేలం ద్వారా తిరిగి అమ్మే పద్ధతి ఉండేది. భక్తులు సమర్పించిన వాటిని విక్రయించడం, కొందరు కొని వాటిని కబేళాలకు తరలిస్తుండటం తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో వేలం ప్రక్రియను నిలిపేసి వాటిని సంరక్షించే గోశాలలకు, వ్యవసాయ పనులు చేసుకొనే రైతులకు ఉచితంగా ఇచ్చే పద్ధతి ప్రారంభమైంది.కానీ దీని అమలుకు పక్కా విధానం లేకుండా పోయింది. గోశాలలు, రైతుల పేరు చెప్పి కొందరు వాటిని చేజిక్కించుకొని అమ్ముకుంటున్నారు. ఈ విషయంలో దేవాదాయ శాఖ ఉద్యోగులు కూడా కమీషన్లకు అలవాటుపడి వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణ ఉంది. అలా వెళ్లే కోడెల పరిస్థితి ఏమిటో పరిశీలించే విధానం లేదు. కబేళాలకు అమ్మేందుకు కోడెలను తీసుకెళ్తున్న వారి వివరాలు తెలిసి కూడా దేవాదాయశాఖలోని కొందరు సిబ్బంది కాసుల కోసం వాటిని అప్పగించేస్తున్నారు. అక్రమాలకు బ్రేక్ పడినా.. గతేడాది ఆగస్టులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తమకు గోశాల ఉందని.. వేములవాడ ఆలయ గోశాల నుంచి గోవులు ఇస్తే పోషించుకుంటామంటూ దేవాదాయశాఖ మంత్రి కార్యాలయానికి అర్జీ పెట్టుకున్నాడు. దాన్ని పరిశీలించాలంటూ మంత్రి కార్యాలయం ఆ అర్జీని వేములవాడ దేవాలయ అధికారులకు పంపింది. ఆ వ్యక్తి ఏకంగా 60 కోడెలు, గోవులు అడగ్గా అధికారులు అభ్యంతరం చెప్పారు.కానీ మంత్రి కార్యాలయం ఆదేశించడంతో ఇవ్వక తప్పలేదు. అలా పొందిన మూగజీవాల్లో చాలా వాటిని ఆ వ్యక్తి అమ్మేసుకున్నాడని ఆ తర్వాత అధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసు కేసు నమోదవగా, విచారణలో అది నిజమేనని తేలింది. అప్పట్లో ఇది సంచలనం కావడంతో కోడెల వితరణను జిల్లా కలెక్టర్ నిలిపివేయించారు. పంపిణీకి కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఉండటంతో ఆయన చర్యలు తీసుకున్నారు. అనారోగ్యం.. ఆపై తొక్కిసలాటలు.. కోడెల వితరణ నిలిచిపోవడం, మొక్కుల రూపంలో కోడెలు వస్తుండటంతో ఆలయ గోశాలలు కోడెలతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం గోశాలల్లో 1,250కిపైగా కోడెలు ఉన్నట్లు సమాచారం. ఉండాల్సిన వాటికంటే మూడు రెట్లు ఎక్కువ గా ఉండటంతో గోశాలల్లో వాటికి తిరిగే చోటు కూడా లేదు. పైగా కనీస వసతులు కూడా లేకపోవడం, వర్షాలు కురుస్తుండటంతో గోశాలలు రొచ్చురొచ్చుగా మారిపోయాయి.రోజుల తరబడి బురద ఉండటంతో గిట్టల దగ్గర నుంచి ఇన్ ఫెక్షన్ సోకి చాలా కోడెలు అనారోగ్యానికి గురవుతున్నాయి. మరోవైపు తొక్కిసలాట కూడా జరుగుతోంది. ఫలితంగా నిత్యం కోడెలు చిపోతున్నాయి. వాటిని ట్రాక్టర్లలో తీసుకెళ్లి గోతులు తవ్వి గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేసి సిబ్బంది చేతులు దులుపుకొంటున్నారు. ఇంత జరుగుతున్నా దేవాదాయశాఖ మంత్రి కార్యాలయం కిమ్మనడం లేదు. విషయాన్ని ఆలయ అధికారులు కమిషనర్ కార్యాలయానికి చేరవేశారు. కానీ మంత్రి కార్యాలయమే నిర్లక్ష్యంగా ఉండటంతో కమిషనరేట్ కూడా మౌనందాల్చింది. ఒక్కరోజే 8 కోడెలు మృత్యువాతవేములవాడ అర్బన్: వేములవాడ రాజన్నకు చెందిన 8 కోడెలు శుక్రవారం మృత్యువాత పడ్డాయి. అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో వాటిని ఖననం చేశారు. శ్రీ రాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను తిప్పాపూర్‌లోని గోశాలలో సంరక్షిస్తున్నారు. ఈ గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉండటంతో తొక్కిసలాట జరిగి చనిపోతున్నాయని ఆరోపణలున్నాయి.ఏటా కోడె మొక్కులతో రాజన్న ఆలయానికి దాదాపు రూ. 22 కోట్లకుపైగా ఆదాయం వస్తున్నా వాటి సంరక్షణపై ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వసతులు సరిగ్గా లేక చిన్నపాటి వర్షానికే గోశాల బురదగా మారి కోడెలు అనారోగ్యం పాలవుతున్నట్లు సమాచారం. ఇప్పటిౖకైనా ఆలయ అధికారులు కోడెల సంరక్షణపై నిర్లక్ష్యం చేయకుండా వసతులు కల్పించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. -
అంతా క్షణాల్లోనే.. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం
సాక్షి, గజ్వేల్/జగదేవ్‌పూర్: వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని వస్తున్నామనే సంతోషం.. వారిలో కొద్ది గంటలు కూడా నిలవలేదు. మూలమలుపు దాటేవరకు సజావుగానే సాగిన ప్రయాణానికి మృత్యువు కాపుగాసిందన్న విషయం తెలియకుండానే పైలోకాలకు వెళ్లిపోయారు. అతివేగం ఆరుగురి ప్రాణాలను బలిగొన్నది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. యాదాద్రి–భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన బొల్లు సమ్మయ్య స్టీల్ సామాన్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య స్రవంతి కూడా చేదోడువాదోడుగా ఉంటుంది. వీరికి కూతురు భవ్య, కుమారుడు కార్తీక్ అలియాస్ లోకేష్ ఉన్నారు. అదే గ్రామంలోని మాంటిస్సోరి పాఠశాలలో భవ్య, ఏడో తరగతి, లోకేష్ 5వ తరగతి చదువుతున్నారు. సమ్మయ్య తన కుటుంబ సభ్యులతో పాటు బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన అత్తమామ రాజమణి–బిట్టు వెంకటేష్‌తో కలిసి రాజన్న దర్శనం చేసుకున్నాడు. మంగళవారం తిరిగి వస్తుండగా, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని మునిగడప వద్ద కాల్వలోకి కారు బోల్తా కొట్టిన ఘటనలో మృత్యువాత పడ్డారు. మూలమలుపు దాటాక.. ప్రమాద ఘటనలో అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తొంది. గ్రామంలోని ఎల్లమ్మగుడి వద్ద నిజానికి ప్రమాదకరమైన మూలమలుపు ఉంది. సహజంగా అక్కడ ప్రమాదాలు జరగడం పరిపాటి. కానీ ఈ మలుపు దాటిన కొద్ది క్షణాలకే కారు అదుపు తప్పింది. డ్రైవింగ్ చేస్తున్న సమ్మయ్య అజాగ్రత్త వహించాడా? వేరే కారణాలున్నాయా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొండపోచమ్మసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌పై నిర్మించిన కల్వర్టును ఎడమ వైపున ఢీకొట్టిన కారు, అదుపుతప్పి మరింత వేగంతో కుడివైపునకు వెళ్లి అక్కడ మట్టిగడ్డను దాటి కెనాల్లో పడిపోయింది. ఈ క్రమంలో కెనాల్ పైభాగంలో ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను బలంగా తాకి గుంతలోకి తలకిందులుగా పడిపోయింది. ఆలయాల సందర్శనకు వెళ్లివస్తున్నప్పుడు సహజంగా మధ్యలో ఆగి దావత్‌లు చేసుకోవడం పరిపాటి. అంతేగాకుండా దైవదర్శనం సందర్భంలో నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం చూస్తుంటాం. తాజా ప్రమాదంలో ఈ రెండు కారణాలు కూడా ప్రభావం చూపాయా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవే కాకుండా మృతులు ప్రయాణించిన కారు కండిషన్ సక్రమంగా లేకపోవడం, అందులో ఆరుగురు ఇరుకుగా కూర్చోవడం కూడా ప్రమాదానికి మరో కారణంగా భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పారిశుధ్య కార్మికులు గమనించి హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు.మృతదేహాలను వెలికి తీయడంలో కీలకంగా వ్యవహరించారు. రోజువారి కూలీలే.. ప్రమాదంలో మృతి చెందిన వెంకటేష్, రాజమణి దంపతులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. కాగా వీరి పూర్వీకులు గ్రామాల్లో భాగవతం ఆడేవారు. వీరు రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. రాజమణి గంపలో గాజులు, స్టీల్, ప్లాస్టిక్ సామాన్లు ఇంటింటికి అమ్ముతూ ఉండగా, వెంకటేష్ గ్రామంలో ఎక్కడైన కూలి లభిస్తే వెళ్లేవాడు. లేని పక్షంలో బొమ్మలరామారం మండలంతో పాటు సమీప మండలాల్లో భాగవతం పాటలు పాడుతూ భిక్షాటన చేసేవాడు. అందరితో కలిసిమెలసి ఉండే ఈ దంపతులు ప్రమాదంలో మృతి చెందడంతో మల్యాల గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంట తీరని శోకం తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యుల బాధ వర్ణణాతీతంగా ఉంది. రాజమణి –వెంకటేష్ దంపతులకు కూతుళ్లు స్రవంతి, విజయ, కొడుకు శ్రీకాంత్ ఉన్నారు. పెద్ద కూతురు స్రవంతి కుటుంబమంతా మృతి చెందగా, విజయకు గోదావరిఖని చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొడుకు శ్రీకాంత్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. కలిసిరాని సెంటిమెంట్ బీబీనగర్‌లోని దాసరి కుటంబాలకు చెందిన వారంతా ప్రతీ ఏడాది వారి ఆరాధ్య దైవమైన వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. రాజన్నను సోమవారం మాత్రమే దర్శించుకోవడం వీరికి సెంటిమెంట్. సమ్మయ్య కుటుంబం ఈ సంవత్సరం కూడా సోమవారమే రాజన్న దర్శనానికి వెళ్లగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయం వారి బంధువులకు తెలియడంతో బీబీనగర్, బొమ్మలరామారం, మల్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఫోన్‌రాగానే గుండె పగిలింది ‘నిన్న మధ్యాహ్నం తర్వాత మా అమ్మనాన్న, బావ, అక్క పిల్లలతో కలిసి వేములవాడ పోయిండ్రు. మొక్కులు తీర్చుకొని ఇయ్యాల 12 గంటలకు బయలుదేరుతున్నమని నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు. సాయంత్రం 4 గంటల తర్వాత జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీవాళ్లకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పడంతో ఒక్కటేసారి గుండె పగిలినట్టయింది’. అంటూ మృతుడు వెంకటేష్ కుమారుడు శ్రీకాంత్ రోదించాడు. తన తండ్రిని గజ్వేల్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించే క్రమంలో మాట్లాడారు. (చదవండి: ప్రమాదమా.. తగలబెట్టారా?) -
రాజన్న దర్శనం.. భక్తుల వద్ద హోంగార్డు చేతివాటం
వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ప్రదీప్ భక్తుల నుంచి డబ్బు తీసుకుని నేరుగా భారీకేడ్ జరిపి ఆలయంలోకి అనుమతించిన వైనం సెల్‌ఫోన్ కెమెరాకు చిక్కింది. ఎస్పీఎఫ్ సిబ్బంది ఈ విషయాన్ని ఈవో రమాదేవి దృష్టికి తీసుకెళ్లారు. సదరు హోంగార్డుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈవో ఆదేశించారు. (చదవండి: మంత్రుల ఆదేశాలు బేఖాతర్.. కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడే) -
నేటి నుంచి రాజన్న బ్రహ్మోత్సవాలు
కరీంనగర్ (వేములవాడ): కరీంనగర్ జిల్లా వేములవాడలోని రాజన్న సన్నిదిలో పార్వతి పరమేశ్వరుల కల్యాణం ఆదివారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఐదురోజుల పాటు జరిగే రాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శివ పార్వతుల వివాహవేడుక జరగనుంది. ముక్కంటి కళ్యాణాన్ని తిలకించడానికి ఉదయం నుంచే లక్షలాది భక్తులు వేములవాడ రాజన్న ఆలయంలో బారులు తీరుతున్నారు.