
ఎల్‌ఈడీ తెరల్లో రాజన్న దర్శన నిర్ణయంపై అర్చకుల అభ్యంతరం
అలా చేయడం ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని మండిపాటు
అభివృద్ధి పనుల నేపథ్యంలో వేములవాడ ఆలయం మూసివేత
సాక్షి, హైదరాబాద్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి మూలవిరాట్టు దర్శనం విషయంలో అధికారులు చేసిన ప్రకటన వివాదాస్పదమవుతోంది. ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నందున పనులు పూర్తయ్యే వరకు ప్రధాన ఆలయంలో దర్శనాలను నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అప్పటి వరకు సమీపంలోని భీమేశ్వరాలయంలోని మూర్తినే సాధారణ భక్తులు దర్శించుకుని పూజాధికాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై కొందరు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజన్న దర్శన భాగ్యాన్ని కల్పించకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రధాన దేవాలయ మూలవిరాట్టు దర్శనాన్ని ఎల్‌ఈడీ తెరల ద్వారా కల్పించాలని నిర్ణయించినట్లు దేవాదాయశాఖ ఇటీవల ప్రకటించింది.
ఇప్పుడు ఈ విషయంపై అర్చకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారత్‌లోని ప్రధాన దేవాలయాల్లో స్వామి, అమ్మవారి మూలవిరాట్టు చుట్టూ విద్యుత్తు కాంతులు కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కేవలం నూనె దీపం వెలుగులోనే దేవుళ్ల దర్శనాలుంటాయి. మూల విరాట్టు వీడియోలు, ఫొటోలు తీయడం కూడా నిషేధం. ఎల్‌ఈడీ తెరలపై స్వామి వారి దర్శనం కల్పించాలంటే కచ్చితంగా వీడియో తీయాలి. స్వామివారి మూలవిరాట్టుపై విద్యుత్తు కాంతి ప్రసరించడం, వీడియో తీయడం... ఇలా రెండు అపచారాలకు కారణమవుతుందని అర్చకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫొటోలు, వీడియో తీయరాదని హెచ్చరిక బోర్డులు పెట్టే దేవాదాయశాఖనే దానిని ఎలా ఉల్లంఘిస్తుందని ప్రశ్నిస్తున్నారు. దీంతో దేవాదాయ శాఖ అయోమయానికి గురవుతోంది.
శృంగేరీ స్వామి సూచనల మేరకు...
శృంగేరి దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం జగద్గురు శంకరాచార్య శ్రీ విదుశేఖర భారతి స్వామి ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఆయన ఆదివారం రాత్రి వేములవాడకు చేరుకోనున్నారు. విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి తగు సూచనలు తీసుకుని ఆ మేరకే చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించవని భావిస్తున్నారు. దేవాలయాల్లో దర్శనాలు, వైదిక కార్యక్రమాలన్నీ శాస్త్రబద్ధంగానే కొనసాగాల్సి ఉంటుందని ప్రముఖ పౌరాణికులు బాచంపల్లి సంతోష కుమారశాస్త్రి పేర్కొన్నారు.