విద్యాశాఖ విభజనకు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ విభజనకు వేళాయె!

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

టీచర్ల ఆప్షన్‌ల కోసమే ఎదురుచూపులు డిసెంబర్‌ 2 తర్వాత ప్రక్రియకు శ్రీకారం 2027 ఏప్రిల్‌ 23 నుంచి కొత్త జిల్లాల్లో విధులు నాన్‌ టీచింగ్‌ పోస్టుల సర్దుబాటుపై స్పష్టత కరువు

చిత్తూరు కలెక్టరేట్‌ : విద్యాశాఖ పాలనా వ్యవహారాలు మాత్రం ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికనే సాగుతున్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ విభజనకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ ప్రక్రియను అధికారులు పకడ్బందీగా చేపడుతున్నారు. ఇక, మిగిలింది టీచర్ల ఆప్షన్‌ మాత్రమే. ఇందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈ ప్రక్రియ ముగిస్తే.. విద్యాశాఖ విభజన పూర్తి అయినట్టే. విభజన అయిన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు, ఉద్యోగుల విభజన ప్రక్రియను చేపట్టేందుకు కసరత్తు చేపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం డిసెంబర్‌ 2వ తేదీ తర్వాత కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపులు చేపట్టి, వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. కేటాయించిన కొత్త జిల్లాల్లో ఉపాధ్యాయులు వెంటనే విధుల్లో చేరాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం, విద్యార్థుల చదువులు, పాఠశాల నిర్వహణకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉపాధ్యాయులు కొత్త జిల్లాల్లో కేటాయించిన స్థానాల్లో చేరిన తర్వాత కూడా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 22వ తేదీ వరకు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలు, ప్రాంతాల్లోనే విధులు కొనసాగించనున్నారు. ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి ఉపాధ్యాయులు తమకు కేటాయించిన కొత్త జిల్లాల్లోనే పూర్తిస్థాయిలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. దీంతో కొత్త జిల్లాల పరిధిలో ఉపాధ్యాయుల సర్దుబాటు, పాఠశాలల వారీగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియ అమల్లోకి రానుంది.

నాన్‌టీచింగ్‌ విభాగాల్లో గందరగోళం....

టీచర్ల విభజనకు ఏర్పాట్లు జరుగుతుండగా, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది కేటాయింపులపై స్పష్టత కరువైంది. డైట్‌, పాఠ్యపుస్తకాల గోడౌన్‌, ఫారిన్‌ సర్వీసెస్‌, సమగ్రశిక్ష, ఉర్ధూ తదితర విభాగాల్లో పనిచేసే నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల కేటాయింపులు పక్కాగా సాగడ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ జాబితాతో సవరణ చేసుకోవాలని సూచించడంతో ఉద్యోగులు, టీచర్లు కలవరపడుతున్నారు. పోస్టుల లెక్కలపై స్పష్టత రావాల్సి ఉండడంతో, ఈ అంశంపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సిబ్బంది ఎదురు చూస్తున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం

ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖను కొత్త జిల్లాల వారీగా విభజనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీచర్ల ఆప్షన్‌కు నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం నూతన జిల్లాల వారీగా పరిపాలనా వ్యవహారాలు సాగించేందుకు ప్రణాళికాబద్ధంగా సన్నాహాలను చేపడుతున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులు.. ఉద్యోగుల కేటాయింపులను పూర్తి చేయనున్నారు. అయితే విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23 తర్వాత కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement