అరకొర పోస్టులు.. ఆశలకు ఆటంకాలు | - | Sakshi
Sakshi News home page

అరకొర పోస్టులు.. ఆశలకు ఆటంకాలు

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

144 ఉద్యోగాల భర్తీకి సవాలక్ష ఇబ్బందులు డీఎస్సీ అభ్యర్థులకు సర్వర్‌ కష్టాలు వివరాలు నింపితే సేవ్‌ కాని దరఖాస్తులు సాంకేతిక సమస్యలను పరిష్కరించని అధికారులు 30తో గడువు ముగుస్తున్నందున ఆందోళనలో అభ్యర్థులు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉపాధ్యాయ కొలువుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న జిల్లా నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. డీఎస్సీ నోటిఫికేషనన్‌లో జిల్లాకు కేటాయించింది కేవలం 144 పోస్టులు మాత్రమే కాగా, ఇప్పుడు ఆ అరకొర పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదు ప్రక్రియ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోకుండా అడ్డంకులు సృష్టిస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.

అడుగడుగునా లోపాలు

ఆనన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి వెబ్‌సైట్‌ తెరిచినప్పటి నుంచి అడుగడుగునా సాంకేతిక లోపాలు వెంటాడుతున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రధానంగా విద్యార్హతలకు సంబంధించిన వివరాలు నమోదు చేసే దశలో వెబ్‌సైట్‌ తీవ్రంగా మొరాయిస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం నమోదు చేసే సమయంలో, సరైన ధ్రువీకరణపత్రాల వివరాలు ఇచ్చినప్పటికీ సిస్టమ్‌ వాటిని స్వీకరించడం లేదు. దీనికి తోడు వివరాలు అన్నీ నింపిన తర్వాత పేజీలు సరిగ్గా తెరుచుకోకపోవడం, నమోదు చేసిన సమాచారం సేవ్‌ కాకుండానే వెబ్‌సైట్‌ క్రాష్‌ అవ్వడం వంటి సమస్యలతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలకు సన్నద్ధం కావడం మానేసి ఇంటర్నెట్‌ సెంటర్‌ల చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

సమీపిస్తున్న గడువు

డీఎస్సీ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండటంతో నిరుద్యోగులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సాధారణంగానే చివరి రోజుల్లో దరఖాస్తుదారుల సంఖ్య పెరిగి సర్వర్‌పై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇప్పటికే వెబ్‌సైట్‌ సరిగ్గా పనిచేయని పరిస్థితుల్లో, చివరి రోజుల్లో సర్వర్‌ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని అభ్యర్థులు భయపడుతున్నారు. కేవలం సాంకేతిక కారణాలతో దరఖాస్తు సమర్పించలేకపోతే, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమ జీవితాశయమైన ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అప్పు చేసి మరీ కోచింగ్‌ తీసుకుని డీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యాను. ఇప్పుడు తీరా దరఖాస్తు చేసుకుందామంటే సర్వర్‌ చుక్కలు చూపిస్తోంది. గంటల తరబడి వేచి చూసి వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు అన్నీ నింపి సేవ్‌ బటన్‌ నొక్కగానే పేజీ ఎర్రర్‌ అని వస్తోంది. మళ్లీ మొదటి నుంచి వివరాలు నింపాల్సి వస్తోంది. ఇంటర్నెట్‌ సెంటర్‌ వాళ్లకు డబ్బులు కట్టలేక, దరఖాస్తు పూర్తి కాక మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. అధికారులు వెంటనే స్పందించి వెబ్‌సైట్‌ సమస్యను పరిష్కరించాలి.

– సుమలత, డీఎస్సీ అభ్యర్థిని, కుప్పం

నేను బీఏ, బీఎడ్‌ పూర్తి చేసి మూడేళ్లుగా డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నా. జిల్లాలో కేవలం 144 పోస్టులే ఉన్నా, కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్నా. ఈ నెల 11న నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తున్నా. కానీ, ఆన్‌లైన్‌లో నా డిగ్రీ ఉత్తీర్ణత సంవత్సరం నమోదు చేస్తుంటే ఇన్‌వ్యాలిడ్‌ డేటా అని చూపిస్తోంది. సర్టిఫికెట్‌లో ఉన్న వివరాలనే నమోదు చేస్తున్నా వెబ్‌సైట్‌ తీసుకోవడం లేదు. ఐదు రోజులుగా రోజూ ఇంటర్నెట్‌ సెంటర్‌ చుట్టూ తిరుగుతున్నా. గడువు దగ్గరపడుతుండటంతో రాత్రుళ్లు నిద్ర కూడా పట్టడం లేదు.

– రాజేష్‌, డీఎస్సీ అభ్యర్థి, చిత్తూరు

చోద్యం చూస్తున్న యంత్రాంగం

దరఖాస్తుల నమోదులో ఎదురవుతున్న సాంకేతిక అవరోధాలను అభ్యర్థులు, నిరుద్యోగ సంఘాల నాయకులు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళుతున్నా ఫలితం లేకుండా పోతోంది. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఏమాత్రం చొరవ చూపడం లేదని, నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి వెబ్‌సైట్‌లోని సాంకేతిక లోపాలను తక్షణమే సరిదిద్దాలని, అవసరమైతే దరఖాస్తుల గడువును మరికొన్ని రోజులు పొడిగించి అర్హులందరికీ న్యాయం చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement