ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

జిల్లాను వణికిస్తున్న విషజ్వరాలు

పారిశుద్ధ్యలోపంతో విజృంభిస్తున్న దోమలు

ఆస్పత్రుల్లో నామమాత్రపు సేవలు

పలు పీహెచ్‌సీలు, యూహెచ్‌సీల్లో అందుబాటులో లేని వైద్యులు

నిర్వీర్యమైన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు

ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్న రోగులు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఒకవైపు గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించి దోమలు విజృంభిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి. ఫాగింగ్‌, పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిలిచిపోవడంతో అర్బన్‌ ప్రాంతాల్లో డెంగీ, పల్లెల్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి.

గాడితప్పిన పల్లె వైద్యం

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో వైద్య సేవలు నామమాత్రంగా మారాయి. పీహెచ్‌సీలలో ఉండాల్సిన ఇద్దరు డాక్టర్లు అటు పల్లెల్లోనూ కనిపించక, ఇటు ఆస్పత్రుల్లోనూ ఉండక రోగులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటలకే ఆస్పత్రుల్లో ఉండాల్సిన వైద్యులు సమయపాలన పాటించడం లేదు. కొందరు గంటల వ్యవధిలోనే ఓపీ చూసి ప్రైవేటు ప్రాక్టీసులకు వెళ్లిపోతుండగా, మరికొందరు మధ్యాహ్నానికే జారుకుంటున్నారు. వీరనమల, శంకరయ్యగుంట, కత్తిరపల్లె, పాతపేట, యాదమరి, మలైనూరు, బంగారుపాళ్యం, ఓగు, సత్రవాడ, జీడీనెల్లూరు, బొమ్మసముద్రం, ప్రశాంత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో వైద్యులు, సిబ్బంది సక్రమంగా అందుబాటులో ఉండటం లేదని సాక్షాత్తూ ప్రభుత్వ సర్వేలోనే తేలడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

పనిచేయని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు

పల్లె ప్రజలకు తక్షణ వైద్యం అందించే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్లినిక్‌లలో ఉండాల్సిన మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తుండడంతో పల్లెల్లో వైద్య సేవలు శూన్యంగా మారాయి. పీహెచ్‌సీలకు వెళితే నాడి పట్టే వైద్యులు లేక కిందిస్థాయి సిబ్బందే మందుల చీటీలు రాసి పంపిస్తున్నారు. జ్వరంతో నీరసించి సైలెన్‌ పెట్టాలని కోరినా వసతులు లేవని తిప్పి పంపుతున్నారు. మందులు, మాత్రలు కూడా అరకొరగానే సరఫరా అవుతున్నాయి.

లెక్కకు అందని కేసులు

జిల్లాలో ఒక జిల్లా ఆస్పత్రి, 4 ఏరియా ఆస్పత్రులు, 7 సీహెచ్‌సీలు, 50 పీహెచ్‌సీలు, 15 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో గడిచిన పది రోజుల్లోనే అధికారిక లెక్కల ప్రకారం 5 వేలకు పైగా జ్వరం కేసులు నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు మరో 8 వేలకు పైగా కేసులు వచ్చి ఉంటాయని తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు అధికారికంగా 145 డెంగీ కేసులు నమోదు కాగా, చిత్తూరు, నగరి, కుప్పం, పలమనేరు ప్రాంతాల్లోనే తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగీ కేసులను అధికారిక లెక్కల్లోకి తీసుకోవడం లేదని, ఇప్పటికై నా పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసి, ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

డాక్టర్లు ఉన్నా.. మందుల్లేవ్‌

ప్రభుత్వ వైద్యం గాడితప్పడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రైవేటు ఆస్పత్రులే దిక్కయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రులన్నీ జ్వరపీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. అక్కడ నాడి పట్టాలంటేనే రూ. 1,000 చెల్లించాల్సి వస్తోంది. సైలెన్‌, రక్తపరీక్షలు, డెంగీ, ప్లేట్‌లెట్స్‌ పరీక్షల పేరుతో రూ. 5 వేల వరకు గుంజుతున్నారు. ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లినా రూ.500 లేనిదే వైద్యం అందడం లేదు.

గుడిపాల : గుడిపాల, బొమ్మసముద్రంలో రెండు పీహెచ్‌సీలు ఉన్నాయి.ఇక్కడ డాక్టర్లు ఉన్నా ప్రభుత్వం నుంచి మందుల సరఫరా నిలిచిపోయింది. దీంతో కొంతో గొప్పో ఉన్న మాత్రలను వైద్యాధికారులు అందిస్తున్నారు. మిగతా ప్రైవేట్‌ ఆసుపత్రిలో తీసుకోవాలని చీటీలు రాసిస్తున్నారు. బొమ్మసముద్రం పీహెచ్‌సీలో ఒకే డాక్టర్‌ ఉండడంతో 104 వాహనానికి కూడా ఆయనే వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు స్టాప్‌ నర్సులే చికిత్స చేయాల్సి వస్తోంది. గుడిపాల పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్‌లు అందుబాటులో ఉన్నారు. పార్మసిస్ట్‌, సబార్డినేటర్‌ పోస్టులు మాత్రం ఖాళీగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement