చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశమందిరంలో పెట్రోల్‌బంక్ నిర్వాహకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పెట్రోల్ బంక్‌లలో వినియోగదారులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఇంధన నాణ్యత, కొలతల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదన్నారు. వినియోగదారులకు సరైన పరిమాణంలో ఇంధనం అందించాలని కోరారు. ప్రతి బంకులో తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, గాలి నింపే యంత్రాలు, ప్రథమ చికిత్స పెట్టె (ఫస్ట్ ఎయిడ్ కిట్) తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పెట్రోలియం ఉత్పత్తుల ఆర్డర్–1980 ప్రకారం వ్యాపార నిర్వహణకు లైసెన్స్ తప్పనిసరిని తెలిపారు. ఫారమ్– ఏ దరఖాస్తు, లైసెన్స్ ఫీజు చలానా, సెక్యూరిటీ డిపాజిట్, ఎక్స్‌ప్లోజివ్స్ లైసెన్స్‌లతో దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోగా ఫారమ్– బీ లైసెన్స్ జారీ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌ఓ వెంకట రాముడు, హెచ్‌పీసీఎల్ ఎస్‌ఓ బిబిన్, ఐఓసీఎల్ ఎస్‌ఓ ప్రభాకరన్ పాల్గొన్నారు.


