త్వరలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు సమాయత్తమవుతున్న సొసైటీ అధికారులు సభ్యత్వం ఉన్నవారికి ఈకేవైసీలు కొత్త సభ్యులకు సైతం ఆహ్వానం
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి చల్లారకముందే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతులకు వెన్నెముకగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల సమరం మొదలుకానుంది.
జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడడంతో, అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ ఆశావాహుల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. దశాబ్ద కాలం అనంతరం ఎన్నికల గంట మోగనుండడంతో పల్లె రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
కాణిపాకం : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ముందుగా చేపట్టాల్సిన ఓటర్ల నమోదు ప్రక్రియను సొసైటీ అధికారులు ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. గతంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి ఈకేవైసీ పూర్తికాకపోవడంతో, ప్రస్తుతం సొసైటీ సీఈఓల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలో రైతులు, సభ్యులు తమ ఆధార్ కార్డులు, వాటికి లింక్ అయిన మొబైల్ నంబర్లతో నేరుగా సొసైటీ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఆధార్‌ను వెరిఫై చేసి వచ్చే ఓటీపీ నంబర్‌ను నమోదు చేసుకుని, తమ ఓటు హక్కును పక్కాగా నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈకేవైసీ పూర్తి కానిపక్షంలో ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళనతో రైతులు సొసైటీ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. కొత్తగా సభ్యత్వం పొందాలనుకునేవారు కూడా రూ.300 షేర్ వాటా కట్టి, ఆధార్ జిరాక్స్, పాన్ కార్డ్, వన్–బీ, ఫోన్ నంబర్ వంటి డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు
ఈ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులను, ఎంపీడీఓలు, తహసీల్దార్లను ఎలక్షన్ ఆఫీసర్లుగా నియమించేందుకు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి జిల్లా సహకార అధికారి, జిల్లా రిజిస్ట్రార్ పూర్తి స్థాయి పర్యవేక్షణ వహిస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ వంటి పరిమితుల కారణంగా పూర్తి స్థాయి షెడ్యూల్ వెలువడేందుకు కొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నప్పటికీ, త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, పల్లె సీమల్లో పంచాయతీ పోరును తలపించేలా సహకార సంఘాల ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంటోంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ఈకేవైసీ ప్రక్రియపై దృష్టి పెట్టగా, రాజకీయ నాయకులు మాత్రం సహకార పీఠం దక్కించుకునే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
ఎన్నికలు తీరు ఇలా...
సొసైటీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు, స్థానిక నేతలు ఇప్పటినుంచే బలమైన వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లాలో 33 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ప్రతి సంఘంలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉంటారు. ఎన్నికై న 13 మంది డైరెక్టర్లు కలిసి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మిగిలిన వారు డైరెక్టర్లుగా కొనసాగుతారు. కేవలం డైరెక్టర్ పదవి మాత్రమే కాకుండా, సొసైటీ పీఠాన్ని కై వసం చేసుకోవడం కోసం ఆశావాహులు ఇప్పటి నుంచే తీవ్రమైన లాబీయింగ్ మొదలుపెట్టారు. కేవలం సాధారణ భూ యజమానులే కాకుండా కౌలు రైతులుగా ఉండేవారు కూడా నిబంధనల ప్రకారం సభ్యత్వం పొంది ఈ పోరులో భాగస్వామ్యమయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించిన సీసీ ఆప్షన్ సర్టిఫికెట్లను సమర్పించి తమ అర్హతలను నిరూపించుకుంటున్నారు.


