తిరుపతి రూరల్: కుప్పం రెస్కో పరిధిలో ఓసీ, బీసీ వర్గాలకు చెందిన గృహ విద్యుత్ వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని, అందుకోసం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హులైన 46,596 గృహాలపై రూ.580 కోట్ల వ్యయంతో సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో శనివారం డిస్కమ్, రెస్కో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పంలో విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
46,596 గృహాలకు సోలార్ సదుపాయం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎస్సీ, ఎస్టీ గృహాలకు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు సీఎండీ పేర్కొన్నారు. ఇప్పుడు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఓసీ, బీసీ వర్గాల గృహాలకూ రూఫ్‌టాప్ సదుపాయం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఏడాదిలో 10 నూతన సబ్‌స్టేషన్లను మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో ఏడు సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని చెప్పారు.రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకంలో భాగంగా కుప్పం రెస్కో పరిధిలో ఫీడర్ లెవల్ సోలరైజేషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. డైరెక్టర్ పి.అయూబ్ ఖాన్, ఓఎస్‌డీ పి.ఉమాపతి, జనరల్ మేనేజర్ టి. శ్రీధర్, రెస్కో ఎండీ ఎస్.సోమశేఖర్ పాల్గొన్నారు.


