తిరుపతి అర్బన్: జర్మన్ భాషను ప్రత్యేక శ్రద్ధతో నేర్చుకుంటే ఆ దేశంలోనే ఉద్యోగంలో చేరచ్చని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. శనివారం ఆయన తిరుపతి బైరాగిపట్టెడలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో గత ఏడాది నుంచి సోషల్ వెల్ఫేర్ సౌజన్యంతో జర్మన్ నర్సింగ్ శిక్షణ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఆ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణ పొందుతున్న విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు. శిక్షణ విధానాలు, పరీక్షల సన్నద్ధత తదితర అంశాలపై సూచనలు చేశారు. ప్రస్తుతం 43 మంది విద్యార్థినులు జర్మన్ భాషలో శిక్షణ పొందుతున్నారని, వారందరూ త్వరగా బీ2 పరీక్షలో ఉత్తీర్ణులై జర్మనీలో ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. జర్మనీ దేశంలో నర్సింగ్, ఫిజియోథెరపీ నిపుణులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. నెలకు సుమారు రూ.2.5 లక్షల వరకు వేతనం పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీనివాసులు రీజనల్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, కర్నూలు రీజియన్ శ్రీనివాసులు, డిప్యూటీ డైరెక్టర్ వీవీ హరీష్, అప్పారెడ్డి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.


