చిత్తూరు కలెక్టరేట్ : జనగణన ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని డీఆర్‌ఓ మోహన్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో మొదటి బ్యాచ్ మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. గతంలో కేవలం ఇళ్ల జాబితా మాత్రమే పూర్తి చేశామని, రెండో దశలో వ్యక్తిగత జనాభా గణన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి ఒక్కరి వ్యక్తిగత, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వివరాలు సేకరిస్తామన్నారు. ఈ ప్రక్రియను అత్యంత గోప్యంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని కోరారు. ట్రైనర్లు, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా విధులు నిర్వర్తించేలా ఈ శిక్షణలో అవగాహన కల్పించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను ఎలా పరిష్కరించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. రెండో దశ జనగణన ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుందన్నారు. స్వీయ గణన కింద వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. ఇంటింటి జనగణన వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు చేపట్టనున్నట్లు వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జనగణనను విజయవంతం చేయాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు ముని చంద్ర, లక్ష్మీకళ పాల్గొన్నారు.


