ఒక్కో ఎద్దుకు రూ.3వేల ప్రవేశ రుసుం
500 పశువులు వచ్చినా రూ.15లక్షల తథ్యం
బహుమతులు, నిర్వహణ ఖర్చు కింద రూ.10లక్షలు
మిగిలిన రూ.5లక్షలు టీడీపీ నేతల జేబులోకే..
పలమనేరు : గతంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగానే పలమనేరు ప్రాంతంలో మైలేర్లు (ఎడ్ల పరుగుపందేలు) సాంప్రదాయంగా నిర్వహించేవారు. పొరుగునే ఉన్న తమిళనాడులోని మైలేర్ల సంస్క్రృతి ఇక్కడికి చేరింది. గతంలో పరుగుపందెంలో గెలిచిన ఎద్దు యజమానికి ఓ టర్కీ టవల్ బహుమతిగా ఇచ్చేవారు. ఏళ్లు గడిచేకొద్దీ ఫస్ట్‌ప్రైజ్ కింద కార్లు, బుల్లెట్లు, పది సవర్ల బంగారు నగల వరకు చేరింది. అయితే సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ నుంచి ఒక్క నెల మాత్రమే ఈ మైలేర్లు సాగుతుండేవి. కానీ, ప్రస్తుతం ఈ మైలేర్లు దూడల పండగ పేరిట అధికారపార్టీ నేతల అండతో కొందరికి డబ్బులు కురిపించే పోటీగా మారింది.
ఇదిగో సాక్ష్యం
పలమనేరు మండలంలోని సంబార్‌పూర్‌లో డిసెంబరు 13వ తేదీన మైలేరు జరిపించనున్నట్లు నిర్వాహకులు ఇప్పటికే కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు. ఈ కరపత్రాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేతోపాటు టీడీపీ నియోజకవర్గ నేతల ఫొటోలను ప్రచురించారు. పైగా బహుమతులుగా తొలిప్రైజు కింద ఫ్యాషన్ ప్రో ప్రొబైక్, ఆపై ఏడో బహుమతి దాకా బ్యాటరీ స్కూటర్లతో పాటు 51 బహుమతులు, ఆపై 80వ బహుమతిదాకా ఫ్యాన్లు, కుక్కర్లను పెట్టారు. బహుమతులును పెంచేకొద్దీ మైలేరుకు వచ్చే పశువుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఆమేరకు కనీసం 500 పశువులు ఈ పోటీలకు వచ్చినా రూ.3వేల ప్రవేశ రుసుంతో రూ.15లక్షలు వసూలవుతుంది. ఇందులో బహుమతులకు పెట్టిన ఖర్చు, పండగ నిర్వహణ కలుపుకుంటే రూ.10లక్షలు అనుకున్నా కేవలం ఒక్కరోజులో నిర్వాహకులకు రూ.5లక్షలు దక్కినట్టే. ఇందులో పోలీసులకు కొంత భాగం ఉంటుందనే మాట బహిరంగసత్యం. అదికూడా ఓ పశువు ఓ రౌండ్‌మాత్రమే పరుగెత్తాలట. ఎందుకంటే పెద్దసంఖ్యలో కోడెదూడలు వచ్చేందుకు ఇదో ఉపాయం. ఇలా సాంప్రదాయం ముసుగులో కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు.
సీజన్‌తో సంబంధం లేకుండా..
సంక్రాంతి సీజన్‌లో ఏర్పాటు చేయాల్సిన ఈ మైలేర్లు పలమనేరు ప్రాంతంలో ఏడాది పొడుగునా సాగుతూనే ఉంటాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, పోలీసులు చూసీచూడనట్లు వదిలేయడం సర్వసాధారణంగా మారింది.
గాయపడితే అంతే..
పశువుల పరుగుపందెం చూసేందుకు వాటిపై చెయ్యి వేసేందుకు వేలల్లో యువత వస్తుంటారు. ఈ పోటీ అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఇందులో ఎవరైనా మృతిచెందినా, లేదా గాయపడినా తమకు సంబంధం లేదంటూ నిర్వాహకులు ఆ కరపత్రంలోనే పేర్కొనడం గమనార్హం. ఇలాంటి ప్రమాదకర మైలేర్లకు పోలీసులు అడ్డుకట్ట వేస్తారా లేదా టీడీపీ నేతలకు దాసోహమవుతారో వేచి చూడాల్సిందే.


