గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ | - | Sakshi
Sakshi News home page

గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

బైరెడ్డిపల్లె : పలమనేరు– కుప్పం జాతీయ రహదారిలోని కై గల్‌ దుముకురాళ్ల బస్‌స్టాప్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఓ గుడిసెలోకి లారీ దూసుకెళ్లింది. వివరాలు.. కుప్పం నుంచి చిత్తూరు వైపు గ్రానైట్‌ బండలతో లారీ వెళుతుండగా డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పూరి గుడిసెలోకి వెళ్లింది. అయితే డ్రైవర్‌, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

విద్యుదాఘాతంతో

వ్యక్తి మృతి

గంగాధర నెల్లూరు : మండలంలోని పద్మాపురంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. వివరాలు.. గ్రామానికి చెందిన వాసు (32) పశువులకు దాణా వేసేందుకు షెడ్లులోకి వెళ్లగా వాటికి విద్యుత్‌ తీగలు తగలడంతో కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. వెంటనే 108లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రైలు కిందపడి ఆత్మహత్య

కుప్పంరూరల్‌ : మండలంలోని గుల్లేపల్లె వద్ద మంగళవారం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు 30 నుంచి 40 ఏళ్ల వ్యక్తి రైలు కింద పడి బలవన్మరణం చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై పసుపు రంగ టీషర్టు ఉందని వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

సంక్షేమ పథకాలకు హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ సమస్య

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో వేలాది మంది అర్హులు హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ సమస్యతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఈ సమస్యను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళుతున్నప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. తమ చేతుల్లో ఏమీ లేదని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వివాహం జరిగినప్పుడు, వారిని పాత కుటుంబం నుంచి విడదీసి కొత్త కుటుంబంగా మార్చాల్సి ఉంటుంది. అలాగే 60 ఏళ్లు పైబడిన వారితో పాటు జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా ఉన్న వారికి హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో ఫ్యామిలీ స్పిట్‌ (కుటుంబం నుంచి వేరు) చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో చేర్పులు, మార్పులు లేకపోవడంతో వేలాది మంది పథకాలు పొందలేక నష్టపోతున్నారు. చాలా కుటుంబాల్లో రేషన్‌ కార్డులు వేర్వేరుగా జారీచేసినా, ఆన్‌లైన్‌లో హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ లో ఒకే కుటుంబంగా చూపిస్తున్నారు. దీంతో పలు రకాల నిబంధనలతో పథకాలకు అర్హత ఉన్నా అనర్హులుగా మిగిలిపోతున్నారు. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ పెండింగ్‌ ఉండడంతో జిల్లాలో ప్రస్తుతం వేలాది మంది కొత్త పింఛన్‌లకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తామేమి చేయలేమని అంతా ప్రభుత్వమే చేయాలని తెగేసి చెప్పేస్తున్నారు. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ సమస్య పరిష్కరిస్తే జిల్లాలో వేలాది మందికి న్యాయం జరుగుతుందని పలువురు కోరుతున్నారు.

శ్రీవారి దర్శనానికి 4 గంటలు

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 3 కంపార్టుమెంట్లు నిండాయి. సోమవారం అర్ధరా త్రి వరకు 65,223 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,112 మంది భక్తులు తలనీలా లు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement