కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం ఆయన శాంతిపురం మండలం గుండి శెట్టి పల్లి వద్ద హంద్రీ–నీవా ద్వారా వచ్చిన కృష్ణా నీటికి జల హారతి ఇచ్చారు. అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ పూల సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా హంద్రీ–నీవా ద్వారా రెండో దశ కింద కృష్ణా జలాలను కుప్పానికి తీసుకువచ్చామన్నారు. కుప్పం ప్రాంత వాసులు చిరకాల ఆకాంక్ష అయిన కృష్ణా జలాల రాకతో సాగుకు, తాగునీటి అవసరాలకు కీలక అడుగు పడిందన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపుతామని వెల్లడించారు.


