టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘంలో అసంతృప్తి సెగలు ఇంటి స్థలాల కేటాయింపులో వివక్ష అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల రాజీనామా అదే కోవలో కోశాధికారి కూడా! ఇదే జరిగితే సంఘ కార్యవర్గ కమిటీ రద్దయినట్టే
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ సభ్యుల్లో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. ఇంతకాలంగా అంతర్గతంగా నెలకొన్ని విభేదాలు బహిర్గతం కావడంతో సంఘ అధ్యక్షుడు ఆర్.ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారని తెలుస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన ఇంటి స్థలాల కేటాయింపులో చోటు చేసుకున్న పరిణామాలు రాజీనామాల పర్వానికి తెర తీసిందనే ప్రచారం వినిపిస్తోంది. మరోవైపు సంఘంలో కీలకంగా ఉన్న కోశాధికారి దాస్ కూడా అదే బాటలో తన పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంఘం పూర్తిగా రద్దయినట్టేనని చర్చనడుస్తోంది.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
టీటీడీలో విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సంక్షేమ సంఘంలో 8,500 మందికి పైగా సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరు పదవీ విరమణకు ముందే సర్వీసులో ఉన్నపుడు చాలావరకు సీనియారిటీ కలిగిన వారున్నారు. అయితే రెండున్నరేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం మార్కెట్ ధరకు ఇంటి స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంది. ఏర్పేడు మండలం, పల్లం గ్రామ పరిధిలో ఒక్కొక్కరికీ 50 అంకణాల చొప్పున 3,500 మంది విశ్రాంత ఉద్యోగులకు స్థలం కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే అప్పటికే సర్వీసులో ఉన్న ఉద్యోగుల్లో చాలామంది సీనియర్లు ఉన్నా అలాంటి వారికి స్థలాల కేటాయింపు ప్రక్రియలో నిరాశ ఎదురైంది. అయితే స్థల విస్తీర్ణం, ప్లాట్లు వంటివి కేటాయించాలనే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అది కాస్తా పెండింగ్‌లో ఉండిపోయింది. ఇప్పటికీ ఇది పరిష్కారం కాలేదు
సర్వీసు ఉద్యోగులకు ఊరట
కాగా అదే సమయంలోఅప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగులకు వడమాలపేట మండలం పాదిరేడు, పల్లం గ్రామ పరిధిలో 432.27 ఎకరాల విస్తీర్ణంలో ఇంటి స్థలాలను కేటాయించి ప్లాట్ల రిజిష్టేషన్ కూడా చేయించింది. ఆ తర్వాత ప్రబుత్వం మారడంతో టీటీడీ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ పలుమార్లు ప్రభుత్వం, టీటీడీ యాజమాన్యం దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఎట్టకేలకు ఇంటి స్థలాల అభివృద్ధి పనులకు ఇటీవల నిధుల మంజూరుకు అనుమతి పొందింది.
అసలు సమస్య ఇక్కడే
సర్వీసులో ఉన్నపుడు తమకు సీనియారిటీ ప్రాతిపదికన ఇంటి స్ధలాల కేటాయింపులో నిబంధనలు పాటించలేదనే అంశాలపై క్రింది స్థాయిలో పదవీ విరమణ పొంది ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగుల సంఘంలో ఉన్న వారు అసంతృప్తితో రగిలిపోతున్నారనే విషయం బాహటంగా వినిపిస్తోంది. అయితే ఎంతో పటిష్టంగా ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘంలో ఇంకా నాలుగు వేల మందికి పైగా ఇంటి స్థలాలు పొందలేని వారున్నారు. ఇంత కాలం అంతర్గతంగా రగిలిపోతున్న వారిలో వ్యతిరేక స్వరం బహిర్గతం కావడంతో సంఘ పెద్దలకు సమస్యగా మారింది. సర్వీసులోని ఉద్యోగులు పొందిన ఇంటి స్థలాల అభివృద్ధి పనులకు ఆయా సంఘాల నాయకుల కృషిని గుర్తుచేస్తూ విశ్రాంత సంఘంలో ఆ విధమైన కృషి సంఘ పెద్దలు ఎందుకు చేయలేదంటూ ఘాటుగా ప్రశ్నించడం వంటి పరిణామాలు కలకలం రేపడంతో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజీనామా చేయాల్సి వచ్చినట్టు సమాచారం.
నాలుగేళ్లుగా రెన్యూవల్ పెండింగ్
టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతి ఏటా రెన్యూవల్ చేయించాలనే విషయాన్ని పక్కదారి పట్టింది. నాలుగేళ్లు అవుతున్నా రెన్యూవల్ చేయించాలనే దిశగా ఆలోచన చేయకపోవడం ఏమిటని పలువురు సంఘ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సంఘ బైలా ప్రకారం కార్యవర్గ కమిటీలో 15 మంది మాత్రమే ఉండాలి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 33కు చేరుకోవడంతో రెన్యూవల్ చేయించడంతో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దీంతో నాలుగేళ్లుగా పేరుకే సంఘం ఉన్నట్లుగా గొప్పగా ప్రచారం చేసుకున్నట్టు టీటీడీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


