డిప్‌ ఐడియా ఫలించేనా..? | - | Sakshi
Sakshi News home page

డిప్‌ ఐడియా ఫలించేనా..?

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

30 మద్యం దుకాణాలకు

ముందుకు రాని యజమానులు

రేపటి నుంచి కొత్తగా దరఖాస్తుల

స్వీకరణకు అవకాశం

డిప్‌కు వెళితే తక్కువ ఫీజుకే దుకాణం

సిండికేట్‌గా మారిన టీడీపీ నేతలు

ప్రభుత్వ ఖజానాకు

గండి కొట్టేందుకు సన్నాహాలు

ఇక జిల్లాలో 30 వరకు దుకాణాల నిర్వాహకులు లైసెన్సుల పునరుద్ధరణను పట్టించుకోలేదు. పైగా ఓ ఐడియా రచించి, దాన్ని అమలు చేయడానికి టీడీపీ నేతలే సలహా ఇచ్చారన్నది బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. పాత లైసెన్సు పునరుద్ధరించుకోవాలంటే రూ.25 లక్షలు చెల్లించాలి. కా, లక్కీడిప్‌కు వెళితే..?! ఒక్కో దరఖాస్తు రుసుము నాన్‌–రీఫండబుల్‌ ఫీజు కింద రూ.3లక్షలు చెల్లించాలి. నాలుగు దరఖాస్తుల నిబంధన పెట్టినా రూ.12 లక్షలకే లైసెన్సు కొట్టేయొచ్చని కొందరు నిర్వాహకులు పథకం వేశారు. ఫలితంగా 30 వరకు దుకాణాలకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆపై వచ్చిన దరఖాస్తుల్లో లక్కీడిప్‌ ద్వారా లైసెన్సులు కేటాయిస్తారు. ఇక్కడే టీడీపీ నేతలు సిండికేట్‌గా మారారు. ముందుగా మాట్లాడుకుని ఒకరు దరఖాస్తు చేసిన దుకాణానికి మరొకరు అప్లికేషన్‌ వేయకూడదని చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డా పర్లేదు.. అధికారం ఉండగానే కిక్కు ద్వారా సంపాదించుకోవాలని తీర్మానం చేసుకున్నారు.

టీడీపీ నేతలు మద్యం మాఫియాగా మారిపోయారు. రెండేళ్లుగా రాత్రింబవళ్లు విక్రయాలు సాగిస్తూ ప్రజల రక్తం తాగేశారు. లైసెన్స్‌ రెన్యూవల్‌ పేరిట చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు తెలుగు తమ్ముళ్లు తమ తెలివితేటలను ఉపయోగిస్తున్నారు. రెన్యూవల్‌ కంటే లక్కీడిప్‌లో వైన్‌షాపు తీసుకుంటే తక్కువ ఫీజుతో సరిపోతుందని పన్నాగాలు పన్నారు. అందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా సుమారు 30 మద్యం దుకాణాల లైసెన్స్‌లను పునరుద్ధరించుకోకుండా మంత్రాంగం నడుపుతున్నారు. అధికార పార్టీ నేతలే సిండికేట్‌గా మారి గంపగుత్తగా వైన్‌షాపులను కై వసం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.

సాక్షి, చిత్తూరు : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చ నేతలకు ఉపాధి చూపించడానికి మద్యం దుకాణాల లైసెన్సులు ప్రైవేటుపరం చేసింది. రెండేళ్ల పాటు ఇందులో సమకూరిన భారీ ఆదాయాన్ని చూసిన కొందరు వ్యాపారులు అతితెలివిని ప్రదర్శించి, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాలని సిద్ధపడిపోయారు. జిల్లాలో మద్యం దుకాణాల రెన్యూవల్‌ కోసం ఇచ్చిన గడువు బుధవారం అర్థరాత్రితో ముగియనుంది. ఇప్పటికి దాదాపు 83 దుకాణాల వరకు లైసెన్సులు రెన్యూవల్‌ చేసుకోగా.. 30 దుకాణాల నిర్వాహకులు మాత్రం లక్కీడిప్‌ దిశగానే మొగ్గుతున్నారు.

పునరుద్ధరణతో రూ.20 కోట్ల ఆదాయం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా చూడకుండా, ప్రజలు మత్తుకు బానిస కాకుండా ఉండాలని ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పాలసీను తీసుకువచ్చారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం వ్యాపారాన్ని భారీ ఆదాయ వనరుగా పరిగణించి.. తమ కార్యకర్తల చేతికి మద్యం దుకాణాల లైసెన్సులను అప్పగించిన విషయం తెలిసిందే. రెండేళ్ల కాలపరిమితితో లైసెన్సు పొందిన నిర్వాహకులకు మళ్లీ మరో ఏడాది పాటు లైసెన్సును కట్టబెట్టడానికి రెన్యూవల్‌ పేరిట కొత్త ఎత్తు వేసింది. రెండు శ్లాబుల్లో ఉన్న మద్యం దుకాణాలకు రూ.23 లక్షలు, రూ.27 లక్షలు చెల్లించాలని పేర్కొంది. అంటే సగటున ఒక్కో దుకాణానికి రూ.25 లక్షల వరకు రెన్యూవల్‌ రుసుము చెల్లించాలి. ఇప్పటి వరకు జిల్లాలో 113 దుకాణాలకు గానూ దాదాపు 83 దుకాణాల నిర్వాహకులు లైసెన్సులను రెన్యూన్యువల్‌ చేసుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.20 కోట్లకు పైగా ఆదాయం లభించింది.

కొన్నింటికే రెన్యూవల్‌

జిల్లాలో ఎనిమిది ఎకై ్సజ్‌ పోలీస్‌ సర్కిళ్లు ఉన్నాయి. అందులో చిత్తూరు అర్బన్‌లో 9, రూరల్‌ 4, పుంగనూరు 5, నగరి 1, పలమనేరు 4, కుప్పం 1, పులిచెర్లలో 7 మద్యం దుకాణాలను రెన్యూవల్‌ చేసుకోలేదన్నది అధికారుల మాట. కార్వేటినగరం సర్కిల్‌లో మాత్రం పది దుకాణాలను రెన్యూవల్‌ చేసుకున్నారు. మద్యం దుకాణాల పునరుద్ధరణ ఆటలో ఎవరి ఐడియా ఫలిస్తుంది..? ఎవరికి అసలైన కిక్కు దక్కుతుందో వేచి చూడాలి.

జిల్లాలో 83 వైన్‌షాపుల లైసెన్స్‌ రెన్యూవల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement