చిత్తూరు కలెక్టరేట్ : ప్రస్తుతం 1980 ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బడి పిల్లల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు 1980 ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు...1980 కాలానికి చెందినవిగా ఆకర్షణీయంగా వస్తున్నాయి. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ట్రెండ్‌కు విపరీతంగా మొగ్గుచూపుతున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా వ్యక్తిగత ఫొటోలను సైతం అప్‌లోడ్ చేసి చూసుకుని మురిసిపోతున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు మోసాల వల విసురుతున్నారు. అందుకు గాను 1980 ట్రెండ్ పేరుతో ఉచిత యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కసారి పర్సనల్ డేటాకు యాక్సెస్ ఇస్తే...ఇక అది మన నియంత్రణలో ఉండదనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచిస్తున్నారు. యాప్‌లను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అధికారిక ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని చెబుతున్నారు. అవసరమైన అనుమతులకు మాత్రమే ఓకే చేయాలని వెల్లడిస్తున్నారు. అనుమానస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదని, యాప్స్‌లో ఫొటోలు, కాంటాక్ట్స్, ఫైల్స్, కెమెరా, లొకేషన్ అన్నింటికీ యాక్సెస్ అడుగుతారని, వాటన్నింటికీ అనుమతిస్తే కష్టాలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో 1980 ట్రెండ్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సైబర్ నేరాలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మోసపోయిన తర్వాత బాధపడేకంటే ముందే జాగ్రత్త పడడం శ్రేయస్కరమని ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 16 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నమోదైన 1,608 ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన పోలీసులు రూ.4.01 కోట్ల నగదును హోల్డ్ చేయించి, అందులో రూ.2.15 కోట్లను బాధితులకు రీఫండ్ చేయించినట్లు వెల్లడించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీ, కార్డు వెనుక ఉన్న సీవీవీ ఎవరితోనూ పంచుకోవద్దని, డిజిటల్ అరెస్ట్, ఆన్‌లైన్ పెట్టుబడుల మోసాలపై జాగ్రత్తగా ఉండాలని కోరారు. మోసం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930 హెల్ప్‌లైన్, లేదా పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే నగదును నిలిపివేసే అవకాశముంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.
25న నులి పురుగుల
నిర్మూలన దినోత్సవం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 25వ తేదీన జాతీయ నులి పురుగుల దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయించాలని అధికారులను ఆదేశించామన్నారు. అంగన్‌వాడీ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, పాలిటెక్నిక్, ఐఐటీ, కళాశాలల్లో కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించాలని స్పష్టం చేశారు. 1 నుంచి 2 ఏళ్ల వారికి సగం మాత్ర, 3 నుంచి 19 ఏళ్ల వారికి ఒక మాత్ర ఇవ్వాలని సూచించారు.


