రిజర్వేషన్లకు కసరత్తు | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లకు కసరత్తు

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

చిత్తూరు, నగరి, పలమనేరులో

ఓటర్ల జాబితా ప్రచురణ

నేటి నుంచి ఇంటింటి సర్వేకు

కార్యదర్శులు

త్వరలోనే ఖరారు కానున్న

మేయర్‌, చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు

మొత్తం ప్రక్రియకు హైకోర్టు

నేడు ఇచ్చే తీర్పే కీలకం

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం ముగిసింది. జిల్లాలోని ఓ కార్పొరేషన్‌తో పాటు రెండు పురపాలక సంఘాల్లో వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రచురితమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను నిర్దారించే పని మరో మూడు రోజుల్లో పూర్తి కానుంది. అనతరం వార్డులతోపాటు మేయర్‌, చైర్‌పర్సన్‌ రిజర్వేషన్‌లను ప్రభుత్వం ఖరారు చేయనుంది. అయితే మొత్తం ప్రక్రియలో హైకోర్టు బుధవారం వెలువరించనున్న తీర్పు కీలకం కానుంది. ఈ మేరకు పురపోరుపై పూర్తి స్పష్టత రానుంది.

సాక్షి, చిత్తూరు : వార్డుల పునర్విభజన ఇప్పటికే పూర్తి కావడంతో చిత్తూరులో 60 డివిజన్లు, పలమనేరులో 36, నగరిలో 40 వార్డులు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం వార్డుల వారీగా ఓటర్ల వివరాలను ఆయా మున్సిపాలిటీల్లో కమిషనర్లు ప్రచురించారు. వీటిపై అభ్యంతరాల స్వీకరణ, మార్పులు, చేర్పులకు మరో మూడు రోజుల అవకాశం కల్పించారు. పనిలో పనిగా బుధవారం నుంచి వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు, నిర్ధారణ చేపట్టనున్నారు. ఈనెల 25వ తేదీకి ఈ ప్రక్రియను పూర్తిచేసి, 26న వార్డులవారీగా ఉన్న ఎస్టీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. అనంతరం 27,28వ తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 29, 30వ తేదీల్లో అభ్యంతరాలపై విచారణ, అక్టోబర్‌ 1న తుది ఓటర్ల జాబితా ప్రచురించి, రాష్ట్ర మున్సిపల్‌ సంచాలకులకు అందజేయనున్నారు. అక్కడి నుంచి ఆదేశాలు రాగానే వార్డులను ఏయే సామాజికవర్గాలకు రిజర్వు చేసామనే వివరాలను కలెక్టర్‌ గెజిట్‌ ద్వారా నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. తర్వాత మేయర్‌, చైర్‌పర్సన్‌ రిజర్వేషన్లను ప్రకటించడం, ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయడం తరువాయిగా ఉంటుంది.

వార్డుల వారీగా ఇలా..

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఏయే వార్డు కేటాయించాలనే దానిపై నిబంధనల ప్రకారం కలెక్టర్‌ తుదిగా ప్రచురిస్తారు. మొత్తం వార్డుల సంఖ్యలో ఎస్టీ 1 శాతం, ఎస్సీ 16 శాతం, బీసీ 34 శాతం (అంచనా) ఉండనుంది. అంటే చిత్తూరు కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉంటే ఎస్టీకి ఒక డివిజన్‌, ఎస్సీలకు 10, బీసీలకు 20 డివిజన్లు రిజర్వు చేయనున్నటు తెలుస్తోంది. మిగిలినవి ఓపెన్‌ కేటగిరీ కిందకు వస్తాయి. 60 డివిజన్లలో 30 డివిజన్లను తప్పనిసరిగా మహిళలకు రిజర్వు చేయనున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

కోర్టు తీర్పుపై ఉత్కంఠ

షెడ్యుల్‌ ప్రకారం మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు వార్డుల వారీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్లాలా..? వద్దా..? అనేదానిలో బుధవారం రాష్ట్ర హైకోర్టు వెలువరించనున్న తీర్పు కీలకం కానుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రకారం ఓటర్లు తేలితే రిజర్వేషన్లు ఖరారు చేయాలని, మరోవైపు రిజర్వేషన్లు 50 శాతం మించ కూడదని కోర్టులో దాఖలైన పిటిషన్లపై వెలువడే తీర్పు ఎలా ఉంటుందోనని రాజకీయ పార్టీలు, అధికారులు ఉత్కంఠంగా చూస్తున్నారు. పిటిషన్లు కొట్టేస్తే మున్సిపల్‌ ఎన్నికలు షెడ్యుల్‌ ప్రకారం జరుగుతాయి. పిటిషన్లలోని అంశం సమంజసంగా ఉందంటే మాత్రం పురపాలక సంఘాల ఎన్నికలకు బ్రేకులు పడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement