అబద్ధమే బాబు అస్త్రం | - | Sakshi
Sakshi News home page

అబద్ధమే బాబు అస్త్రం

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

బైరెడ్డిపల్లె : ఎన్నికల సమయంలో చంద్రబాబు అబద్ధాలనే అస్త్రంగా వాడుకుంటారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం బైరెడ్డిపల్లెలో ఆయన వైఎస్సార్‌సీపీ నేతలతో మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో స్పష్టంగా వివరించాలన్నారు. రైతులను ఆదుకునేందుకు ఒక్క రూపాయి కూడా విదిల్చిన పాపాన పోవడం లేదని మండిపడ్డారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్‌, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని మోసం చేశారన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, లేకుంటే నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని స్పష్టం చేశారు. ప్రజల్లో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, దీంతో కొత్త పింఛన్లు ఇస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్‌ వ్యవస్థ తీసుకువచ్చి ఇంటి వద్దనే అర్హులను గుర్తించి పింఛన్లు అందించామని వెల్లడించారు. గతంలో ఇచ్చిన పింఛన్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పైబడినా ఒక్క కొత్త పింఛన్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగడుతూ విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, కో–ఆప్షన్‌ సభ్యుడు పైజుల్లాసాబ్‌, రెడ్డి వీనస్‌, వెంకట్‌ తేజ, పీరూసాబ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement