గుడిపాల: తమిళనాడుకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీ, టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌పేట, జీడీనెల్లూరులోని ఇసుక రీచ్‌ల నుంచి ట్రాక్టర్‌లతో ఇసుకను తీసుకువచ్చి సీఎంఖండిగ మునీశ్వరస్వామి గుడివెనుక ఉన్న తాటికుంట చెరువు వద్ద డంప్ చేస్తున్నారని తెలిపారు. తర్వాత అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై అందిన సమాచారంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాడి చేశామని తెలిపారు. లారీ, టిప్పర్‌లో ఇసుక లోడ్ చేసుకుని తమిళనాడుకు వెళుతుండగా ఆపి ఇద్దరు డ్రైవర్లను పట్టుకుని విచారించినట్టు తెలిపారు. వారు 20 రోజులుగా రాత్రి వేళల్లో తమిళనాడులోని వేలూరు, రాణిపేట, వాలాజా ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నామని అంగీకరించారని వెల్లడించారు. ఇసుకను నారగల్లుకు చెందిన టీడీపీ నాయకుడు ఉమాపతి అలియాస్ విక్కి డంప్‌చేసి అమ్ముతున్నాడని డ్రైవర్లు చెప్పారని తెలిపారు. దీంతో టిప్పర్ డ్రైవర్లు అజిత్‌కుమార్, అంబారసు, ఉమాపతి అలియాస్ విక్కీపై కేసునమోదు చేశామని తెలిపారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.
స్వయం సహాయక సభ్యులు ఆర్ధికంగా ఎదగాలి
బంగారుపాళెం : స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం వీవోఏలకు నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా గ్రామ సంఘాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక పథకాలను సద్వినియోగం చేసుకుని తద్వారా అభివృద్ధి చెందాలని సూచించారు. తీసుకున్న రుణాలు, సంఘాల లావాదేవీలను మన డబ్బులు–మన లెక్కల యాప్‌లో సరి చూసుకోవాలన్నారు. లావాదేవీల పుస్తకాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలన్నారు. హెల్త్ అండ్ న్యూట్రీషన్ ద్వారా కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. సీ్త్రనిధి, సీఐఎఫ్ రికవరీలు, బ్యాంక్ రుణాలు వంద శాతం రికవరీ చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో రవికుమార్, సుబ్బారెడ్డి, హరిప్రసాద్, మధుసూదన్, శ్రీహరి, వేణు పాల్గొన్నారు.


