చిత్తూరు కలెక్టరేట్ : స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కలెక్టర్ పాల్గొని జిల్లాలో చేపడుతున్న ఎన్నికల ముందస్తు ఏర్పాట్లను వివరించారు. జిల్లాలోని 622 గ్రామ పంచాయతీలు, 5,914 వార్డులతో పాటు పలమనేరు, నగరి, చిత్తూరు, కుప్పం మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, కనీస సౌకర్యాల కల్పన, మ్యాపింగ్ ప్రక్రియ చేస్తున్నట్టు వెల్లడించారు. కులాల వారీగా ఓటర్ల వివరాల పరిశీలన ఇప్పటికే ప్రారంభమైందన్నారు. నిబంధనల ప్రకారం మార్పులు–చేర్పులు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో ఎలాంటి కోర్టు కేసుల ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది కొరతపై ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదించామన్నారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీఆర్వో మోహన్ కుమార్, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీపీవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


