ఐరాల : మండలంలోని అడపగుండ్లపల్లె వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కాణిపాకం పోలీసుల కథనం మేరకు.. ముదిగోళం గ్రామానికి చెందిన ఢిల్లీ(32) సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో చిత్తూరుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న నేమ్‌బోర్డును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఢిల్లీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని 108 వాహ నంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఢిల్లీకి భార్య కావ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళల భద్రతకు శక్తి యాప్
చిత్తూరు అర్బన్: మహిళల భద్రత కోసం రూ పొందించిన శక్తి యాప్‌ను ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆపద, అత్యవసర సమాయాల్లో ఈ యాప్ వినియోగిస్తే పోలీసులు సహాయ పడతారన్నారు. ప్రధానంగాయువత, ఉద్యోగినులు, వ్యాపారాలు చేసే వాళ్లు శక్తి యాప్‌ను ప్లేస్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు.
బోగస్ జీఎస్టీపై అసెంబ్లీలో చర్చ
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరులో జరిగిన బోగ స్ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌పై శాసనమండలిలో ఎమ్మె ల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి మంగళవారం ప్రశ్నించా రు. రూ.వందల కోట్లు అక్రమాలు జరిగాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో నకిలీ కంపెనీల ద్వారా రూ.వేలకోట్లలో అక్రమ వ్యాపా రం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.40 వేల కోట్లు వాణి జ్య పన్నులశాఖకు పన్ను బకాయిలు ఉన్నా యని వెల్లడించారు. కూలీలు, దివ్యాంగుల పేర్లతో నకిలీ సంస్థలను నమోదు చేసి తద్వా రా రూ.వందల కోట్ల బిల్ ట్రేడింగ్ జరిగిందని స్పష్టం చేశారు. చిత్తూరులోనే రిజ్వన్ అనే స్క్రాప్ వ్యాపారి దాదాపు రూ.2వేల కోట్ల వర కు బిల్ ట్రేడింగ్ ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేశాడని తెలిపారు. అతనిపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. దాదాపు 15 ఏళ్లుగా రూ.వేల కోట్లు పన్నులను ఎగ్గొట్టాడని ఆరో పించారు. బోగస్ సంస్థల నివారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సైబర్‌నేరాల తరహాలో, జీఎస్టీ నిబంధనలను సడలింపు అవకాశాలను వినియోగించుకుని బోగస్ ఇన్‌వాయిస్‌లతో పన్ను లు ఎగవేస్తున్నారన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని, బోగస్ ఇన్‌వాయిస్ చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకొని రికవరీ చేపడతామని స్పష్టం చేశారు.
కరెంట్ ఉచ్చు వేసిన
వ్యక్తి అరెస్ట్
బంగారుపాళెం: అడవి జంతువుల కోసం కరెంట్ ఉచ్చు వేసి ఓ వ్యక్తి మరణానికి కారకుడైన నిందితుడిని మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని గుంతూరులో ఈ నెల 15వ తేదీ రైతు నరసింహులు నాయుడుకు చెందిన మామిడి తోటలో ఏర్పాటు చేసిన కరెంట్ ఉచ్చులో చిక్కుకుని చిన్నస్వామి (40) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నిందితుడు మార్కొండయ్యను పాలేరు అండర్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు.


