‘‘ ఏళ్ల తరబడి తిరుగుతున్నాం.. కాళ్లరిగిపోతున్నాయి కానీ, సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం.. అర్జీలు సమర్పిస్తున్నాం. ఫలితం శూన్యంగా ఉంది. మా గోడును పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు.. కలెక్టర్ సర్.. మీరు ప్రత్యేక దృష్టి సారించాలి. మా కష్టాలు తీర్చేందుకు చొరవ తీసుకోవాలి’’ అంటూ బాధితులు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ (గ్రీవెన్స్)కు పెద్దసంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. వివిధ సమస్యలపై మొత్తం 281 వినతులు అందించారు. ఈ క్రమంలోనే కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్ మోహన్ కుమార్ పాల్గొన్నారు. – చిత్తూరు కలెక్టరేట్
పాస్‌బుక్ మంజూరుకు వినతి
తవణంపల్లె మండలం మత్యం గ్రామానికి చెందిన కె.కృష్ణయ్య పట్టాదారు పాస్‌బుక్ మంజూరు చేయా లని పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. సర్వే నంబర్ 32 లోని 0.60 సెంట్ల భూమి తాతల కా లం నుంచి తమ అనుభవంలో ఉందన్నారు. ఈ మేరకు పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాల ని కోరారు. మండల స్థాయిలో పలుమార్లు అర్జీ లు సమర్పించినా పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వినతి అందజేసినట్లు తెలిపారు.
ఐటీ స్టేటస్ తొలగించాలి
శాంతిపురం మండలం కడపల్లెకు చెందిన దివ్యాంగు డు ఆర్.లోకేష్ తన ఆవేదనను అర్జీ రూ పంలో పీజీఆర్‌ఎస్ లో అందజేశారు. ఆయన మాట్లాడు తూ గతంలో జేసీబీ ఉన్నందున ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవాడినన్నారు. ఆరేళ్ల క్రితం జేసీబీ విక్రయించినా ఆన్ లైన్ హౌస్‌హోల్డ్ డేటాలో ఇంకా ఇన్‌న్‌కమ్ ట్యాక్స్ పేయర్ గానే చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగింపునకు మండల అధికారులకు పలుమార్లు అర్జీలిచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
ప్రభుత్వ భూమి ఆక్రమణ
ఆక్రమణలోని ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవాలని ఐరాల మండలం ఎస్సీ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. వారు మాట్లాడుతూ ఐరాల మండలం ఎస్సీ కాలనీలో తాము నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఐరాల, నయనంపల్లి రహదారి పక్కన సర్వే నంబర్ 718లో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని వెల్లడించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు.
స్థలం, ఇల్లు మంజూరుకు వినతి
జీడీ నెల్లూరు మండలం నర్సాకొత్తకాలనీ (కొత్త వెంకటాపురం ఎస్టీ గ్రామం)కి చెందిన ఏ. శ్రీవాణి పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తమ కాలనీలోని 10 నిరుపేద కుటుంబాలకు గత 8 ఏళ్లుగా సొంత ఇంటి స్థలం, ఇల్లు కానీ లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మండల అధికారులకు ఎన్ని సార్లు అర్జీలు ఇచ్చినా దయ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇల్లు, స్థలం మంజూరు చేయాలని కోరారు.


