గుర్తుతెలియని వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వృద్ధుడి మృతి

Aug 18 2026 7:34 AM | Updated on Aug 18 2026 7:34 AM

● అత్యవసర వైద్య సేవలు బహిష్కరణ ● రుయాలో వైద్య సేవలకు కొంత అంతరాయం ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు

నగరి : స్థానిక పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని రోడ్డు పక్కన ఖాళీ షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఈ విష యం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు భిక్షాటన చేసుకునే వృద్ధుడని తెలుసుకున్నారు. పురపాలక సిబ్బంది మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

కుప్పంరూరల్‌ : కుప్పం మండలం కనుమపచ్చార్లపల్లెలో సోమవారం అనుమానాస్పదంగా ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన చంద్రప్ప భార్య అమ్మణ్ణమ్మ (45) చిన్న ఒబ్బకు చెందిన వెంకటేష్‌ పూల తోటలో మృతదేహంగా కనిపించింది. చూసేందుకు హత్యకు గురైనట్లు తెలుస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో

వ్యక్తి ఆత్మహత్య

ఐరాల: మండలంలోని బొమ్మసముద్రం దళితవాడలో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాణిపాకం ఎస్‌ఐ నరసింహులు కథనం మేరకు.. దళితవాడలో మంజుల, రుద్రయ్య(42) దంపతు లు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వైఎస్‌ గేటు వద్ద అద్దె భవనంలో రుద్రయ్య మెకానిక్‌గా, భార్య ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రుద్రయ్య సొంత ఇల్లు నిర్మించడం కోసం కొంతమేర అప్పులు చేశాడు. అలాగే కుమార్తె మాన్విశ్రీ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో వేలూరు సీఎంసీలో మరో రూ.5 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టాడు. ఈ నేపథ్యంలో మూడు నెలలుగా వైఎస్‌ గేటులో ఉన్న రూమ్‌కు అద్దె చెల్లించలేదు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి గురికావడంతో మధ్యాహ్నం ఇంట్లోనే బాత్‌రూమ్‌లో ఉరివేసుకున్నాడు. భార్య మంజుల విధులు ముంగిచుకుని ఇంటికి వచ్చి వేలాడుతున్న భర్తను చూసి కేకలు వేసింది. స్థానికులు వెంటనే రుద్రయ్యను కిందకు దించి కొత్తపల్లె పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెరువులో గుర్తు తెలియని మృతదేహం

పుత్తూరు : వీరప్పరెడ్డిపాళెం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమ వారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నాగేంద్రబాబు కథనం మేరకు.. మృతుడి వయసు సుమారు 55 ఏళ్లు ఉంటుంది. ఒంటిపై చుక్కల బ్లూ కలర్‌ షర్ట్‌ ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జూడాల ఆందోళన ఉధృతం

తిరుపతి తుడా: జూడాల ఆందోళన ఉధృతమైంది. స్టైఫండ్‌ను 30శాతానికి పెంచాలని డిమాండ్‌ చేస్తూ జూడాలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎస్వీ మెడికల్‌ కళాశాల జూనియర్‌ డాక్టర్లు సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలనూ బహిష్కరించారు. నిరసన దీక్ష శిబిరం నుంచి 680 మంది జూనియర్‌ డాక్టర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దీక్ష శిబిరంలో కూర్చుని నినాదాలు మిన్నంటించారు. తమ న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని జూనియర్‌ డాక్టర్లు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టైఫండ్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గడిచిన ఐదు రోజులుగా ఓపీ సేవలను, తరగతులను బహిష్కరించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో అత్యవసర వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశామని చెప్పారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

జూనియర్‌ డాక్టర్ల విధుల బహిష్కరణతో రుయా ఆస్పత్రిలో పేదల వైద్యానికి కొంత అంతరాయం ఏర్పడింది. వందలాదిమంది రోగులు అత్యవసర వైద్యం ఓపీ సేవలకు వస్తుంటారు. రోగులకు వైద్యం అందించడంలో జూనియర్‌ డాక్టర్లే కీలకంగా వ్యవహరిస్తుంటారు. సుమారు 680 మంది జూడాలు విధులు బహిష్కరించడంతో వైద్య సేవలకు కొంత అంతరాయం ఏర్పడింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మనోహర్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రొఫెసర్లు, సివిల్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పీహెచ్‌సీ, యూహెచ్‌సీ వైద్యులు, బీహెచ్‌ఎంఎస్‌ వైద్యులు మొత్తం 165 మందిని రంగంలోకి దింపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement