పుత్తూరు: పుత్తూరు ఎంపీడీఓ శ్రీదేవి పనితీరు ఆమోదయోగ్యంగా లేదని, ఆమెను తక్షణం జెడ్పీకి సరెండ్ చేయాలని ఎంపీపీ మునివేలు కోరారు. సోమవారం తిరుపతి కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఎంపీ గురుమూర్తితో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ ఎంపీడీఓ ప్రోటోకాల్ పాటించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం అందించడం లేదని, కనీసం ఆహ్వానించడం లేదని ఆరోపించారు. చివరకు ఎంపీడీఓ కార్యాలయంలో చేపట్టే శిక్షణ తరగతులు, సర్వసభ్య సమావేశాల సమాచారం సైతం తెలియజేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత మండల సర్వసభ్య సమావేశంలో క్యూసీ అకౌంట్ ద్వారా రూ.2 లక్షలు విత్‌డ్రా చేశారని, దానికి సంబంధించి ఖర్చుల వివరాల అడిగినా వెల్లడించలేదన్నారు. వేపగుంట పంచాయతీ సెక్రటరీని లీవులో పంపించారని, అతడి స్థానంలో ఇన్‌చార్జి సెక్రటరీగా మరొకరిని నియమించారని, ఆయన విధులకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. గత జనరల్ బాడీ మీటింగ్‌లో వేపగుంట బీసీ కాలనీలో కొత్తగా డ్రైనేజీ ఏర్పాటు చేయడానికి సభ్యుల ఆమోదం పొందినా ఇంత వరకు వర్క్ ఆర్డర్ ఇవ్వలేదని మండిపడ్డారు. దాదాపు 14 పంచాయతీల్లో మౌలిక వసతుల పనులు ఆగిపోయాయని తెలిపారు. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలను ఎంపీపీ అయిన తన ద్వారా కాకుండా టీడీపీ నేతలతో చేయిస్తున్నారని ఆరోపించారు. ఎంపీడీఓ విధులకు సైతం సక్రమంగా హాజరు కావడం లేదని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓను జెడ్పీకి సరెండ్ చేయాలని తీర్మానం చేశామని, ఆ మేరకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మండల కో–ఆప్షన్ మెంబర్ రాంబత్తయ్య, మాజీ సర్పంచులు గిరిజా ప్రసాద్, ఉదయ్‌కుమార్, మోహన్‌గాంధీ పాల్గొన్నారు.


