చిత్తూరు అర్బన్ : నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై మొత్తం 46 వినతులు వచ్చినట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోపు బాధితులకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని ఆదేశించారు.
గదుల దళారీ ముఠా గుట్టురట్టు
తిరుమల: తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద నకిలీ గుర్తింపు పత్రాలతో వేరొకరి పేర్లతో గదులు పొంది వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న దళారీ ముఠా ప్రయత్నాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం భగ్నం చేసింది. ఆగస్టు 16న అప్పటికే ఒక గది పొందిన వ్యక్తి మరో గుర్తింపు కార్డుతో తిరిగి గది కోసం క్యూలో నిలబడడాన్ని సీఆర్వో కార్యాలయ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు కేరళ మలప్పురం జిల్లాకు చెందిన ఆషిక్ అలీ (32)గా గుర్తించారు. అతని వద్ద రెండు నకిలీ ఆధార్ కార్డులు, గది రిజిస్ట్రేషన్ స్లిప్, రూ.800 నగదు, సెల్‌ఫోన్‌న్‌ను స్వాధీనం చేసుకున్నారు. రంజిత్ అనే దళారి ఒక్కో గదికి రూ.1,000 చొప్పున ఇస్తామని తనను నియమించుకున్నట్లు ఆషిక్ విచారణలో వెల్లడించాడు. ముఠాలోని ఇతర సభ్యులపై విచారణ కొనసాగుతోంది. విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల–2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నకిలీ ఆధార్ కార్డుల ప్రామాణికతను నిర్ధారించడంతో పాటు, సాంకేతిక ఆధారంగా ముఠా వ్యవహారాలపై పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. ఎవరైనా దళారి డబ్బు తీసుకుని గది ఇప్పిస్తానని సంప్రదిస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ నం.9866898630 లేదా టీటీడీ కాల్ సెంటర్ నం.155257కు సమాచారం ఇవ్వాలని కోరారు.


