పూతలపట్టు(యాదమరి): బంధుత్వానికి విలువ ఇచ్చి, తన కుమార్తెను చేతి లో పెట్టాడు ఆ మామ. ఏడు అడుగులు వేయించి, బంధాన్ని ముడివేస్తే... చివరకు అదే చేతులతో తన ప్రాణాలు తీస్తాడని ఆ వృద్ధుడు ఊహించలేకపోయాడు. సీమంతం వేడుకకు వచ్చిన అల్లుడు ఆ ఇంట్లోనే యముడిలా మారి మామను కిరాతకంగా హతమార్చాడు.
కన్న కూతురినిచ్చి..!
పూతలపట్టు మండలం, రంగంపేటకు చెందిన దినసరి కూలీ సుబ్రమణ్యం (60) తన పెద్ద కుమార్తె బంధువైన అశోక్‌కు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించాడు. బతుకుదెరువు కోసం దుబాయ్‌లో పనిచేస్తున్న అశోక్, రంగంపేటలోని బావమరిది భార్య సీమంతం వేడుక కోసం ఇటీవల ఊరికి వచ్చాడు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకు న్న సమయంలో ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం వారి కొంపముంచింది.
ఏడు అడుగులు వేయించిన చేతులే...
ఆదివారం తెల్లవారుజామున 5 గంటలవుతున్నా నిద్రపోకుండా ఫోన్‌న్‌లో ఆన్‌న్‌లైన్ గేమింగ్ ఆడుతు న్న అశోక్‌ను మామ సుబ్రమణ్యం మందలించాడు. కన్న తండ్రిలా హితవు పలికిన మామ మాటలకు ఆవేశంతో రగిలిపోయిన అశోక్ విచక్షణ కోల్పోయా డు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అల్లుడే ఉన్మాదిలా మారాడు. వృద్ధుడని కూడా చూడకుండా సుబ్రమణ్యంపై దాడి చేసి కింద పడేశాడు. ఏ చేతులతోనైతే పవిత్ర బంధాన్ని ముడివేశాడో, అదే చేతులతో మామ గుండెలపై ఎక్కి కూర్చుని పిడుగుద్దులతో బలంగా బాదాడు. ఆ దెబ్బలకు తాళలేక వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
తీవ్ర విషాదంలో కుటుంబం
సీమంతం వేడుకతో మురిసిపోవాల్సిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. కన్న తండ్రిని కోల్పోయిన కుమార్తెలు, కళ్లముందే భర్త రాక్షసత్వాన్ని చూసిన భార్య రోదనలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి. ఘటన అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వెంకటగిరి సమీపంలో అరెస్ట్ చేశారు. పూతలపట్టు సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సర్దార్ గౌతు లచ్చన్న జీవితం స్ఫూర్తిదాయకం
చిత్తూరు కలెక్టరేట్ : స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు ఉద్యమకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని డీఆర్వో మోహన్‌కుమార్ కొనాయాడారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ భవనంలో సర్దార్ గౌతు లచ్చన్న 117 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఆర్వో ముందుగా గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన ఉప్పు సత్యాగ్రహంతో పాటు స్వాతంత్య్రోద్యమంలో లచ్చన్న చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. పదవులు ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేయడం ఆయన ప్రత్యేకత అని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీ బాషా, జిల్లా మత్స్య శాఖాధికారి జి.జే.ప్రమోదమల్లె, విశ్రాంత ఎకై ్సజ్ సీఐ ఈశ్వరయ్య, బీజేపీ నేత అట్లూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.


