కుటుంబీకులను ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్ రాయలసీమ విద్యాసంస్థల అధినేత అంతిమయాత్రకు అశేష జనం
తిరుపతి ఎడ్యుకేషన్ : విద్యారంగానికి దశాబ్దాల పాటు దిశానిర్దేశం చేసి, వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన రాయలసీమ విద్యాసంస్థల అధినేత వై.కొండారెడ్డి అంతిమయాత్రకు అశేష ప్రజానీకం హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. రాయలసీమ ప్రాంత విద్యారంగంలో ఓ శకం ముగిసిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. లెక్చరర్‌గా పనిచేస్తూ పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్యనందించాలనే సంకల్పంతో రాయలసీమ విద్యాసంస్థలను ఆయన ప్రారంభించారు. ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి అందించిన మహనీయుడు కొండారెడ్డి మృతి విద్యారంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు కొనియాడారు.
ఘనంగా నివాళులు
తిరుపతి బైరాగిపట్టెడలోని రిమ్స్ విద్యాసంస్థల ప్రాంగణంలో కొండారెడ్డి పార్థివదేహా న్ని ఆదివారం ప్రజల సందర్శనార్థం ఉంచా రు. కడసారి చూసి నివాళులర్పించేందుకు రాయలసీమ వ్యాప్తంగా ఎందరో రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు,విద్యాసంస్థల అధినేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు.
అంతిమయాత్రకు తరలివచ్చిన ప్రముఖులు
రాయలసీమ విద్యాసంస్థల అధినేత వై.కొండారెడ్డి అంతిమయాత్రకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, మాజీ ఎంపీ చింతామోహన్, వైఎస్సార్‌సీపీ తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్‌రెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సుబ్బారెడ్డి, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, మదనపల్లె మున్సిపల్ మాజీ చైర్మన్ మనూజరెడ్డి, వైద్యులు బలరామరాజు, హాస్పిటల్ అధినేతలు మదన్‌మోహన్‌రెడ్డి హాజరై అంజలి ఘటించారు.
కొండారెడ్డి అంతిమ సంస్కారాల్లో కుటుంబ సభ్యులు
మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శ
మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాయలసీమ విద్యాసంస్థల అధినేత వై.కొండారెడ్డి తనయుడు వై.ఆనందరెడ్డిని ఫోనులో పరామర్శించారు. కొండారెడ్డి మృతి విద్యారంగానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వాసులకు తీరని లోటన్నారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
తిరుపతిలో సాగుతున్న కొండారెడ్డి అంతిమయాత్ర


