చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఫార్మెటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ–1) పరీక్షలను మరింత పకడ్బందీగా, వినూత్నంగా నిర్వహించేందుకు విద్యా శాఖ సిద్ధమైంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఎఫ్‌ఏ–1 పరీక్షలు ప్రారంభం కానున్నా యి. జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 1.19 లక్షల మంది, ప్రైవేటు పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 80 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
బుక్‌లెట్ విధానం
ఈ ఏడాది ఎఫ్‌ఏ–1 పరీక్షల కోసం ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా బుక్‌లెట్ అందించనున్నారు. విద్యార్థి వ్యక్తిగత వివరాలు, సంభాషణ, వివేచనాత్మక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, అపాల్ ఐడీ, సృజనాత్మక ప్రాజెక్టులు, రాత అంశాలు, సాధించిన మార్కులు, గ్రేడింగ్ విధానం వంటివన్నీ ఈ బుక్‌లెట్‌లో ముద్రించి ఉంటాయి. ఉపాధ్యాయులకు సూచనలతో పాటు సమాధానాల మూల్యాంకనానికి ఓఎంఆర్ పత్రాన్ని పొందుపరిచారు.
పరీక్షా సమయాలు, షెడ్యూల్
1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు (ఆగస్టు 17 –19) ఉదయం సెక్షన్‌న్‌లో 9.30 నుంచి 10.45 గంటల వరకు, మధ్యాహ్నం సెక్షన్‌లో 1.15 నుంచి 2.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు (ఆగస్టు 17–20) మొదటి సెక్షన్ (ఉదయం) 9.30 నుంచి 10.45 గంటల వరకు, రెండో సెక్షన్ (ఉదయం) 11.00 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, మూడో సెక్షన్ (మధ్యాహ్నం) 1.15 నుంచి 2.30 గంటల వరకు, నాలుగో సెక్షన్ (సాయంత్రం)2.45 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.


