వేడుకలపై విమర్శ | - | Sakshi
Sakshi News home page

వేడుకలపై విమర్శ

Aug 16 2026 5:15 AM | Updated on Aug 16 2026 5:15 AM

పలుకుబడి పండుగ

సిఫార్సులకే ప్రశంసాపత్రాలు

కష్టపడ్డ వారికి అవమానం

పోలీస్‌ పరేడ్‌లో యంత్రాంగం వైఫల్యం

అవే పాటలు.. అవే శకటాలు..

ప్రైవేట్‌ స్కూళ్లకే ప్రచారం

ఉత్తమ ఉద్యోగులకు చేదు అనుభవం

424 అవార్డుల్లో సింహభాగం

పక్షపాతమే

కొత్తదనం లేని ప్రదర్శనలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. దేశ స్వాతంత్య్ర ఫలాలను, సాధించిన ప్రగతిని ప్రతిబింబించాల్సిన ఈ కార్యక్రమం కాస్త అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం, అరకొర ఏర్పాట్ల వల్ల ప్రాధాన్యాన్ని కోల్పోయింది. ముందస్తు ప్రణాళిక కరువై, స్వార్థ ప్రయోజనాలు పడగ విప్పడంతో ఈ ఏడాది ఉత్సవాలు కేవలం యధాతథ కార్యక్రమంగా, అపహాస్యంగా ముగిశాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

సిఫార్సులకే ప్రశంసా పత్రాలు

ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అందించే ప్రశంసాపత్రాల పంపిణీ ప్రక్రియ అత్యంత వివాదాస్పదంగా మారింది. నిజాయితీగా, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన సిబ్బందిని విస్మరించి, పాలకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగే పలుకుబడి ఉన్న వ్యక్తులకే అవార్డులు కట్టబెట్టారు. మొత్తం 424 మందికి ప్రశంసాపత్రాలు అందజేయగా, ఇందులో అత్యధిక భాగం ముందస్తు సిఫార్సులు ఉన్నవారికే దక్కాయి. వేడుకలు జరుగుతున్న సమయంలోనూ మధ్యమధ్యలో కొత్త పేర్లను చేర్చుతూ అర్హులైన వారికి అన్యాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో ఎంతోమంది అధికారులు శ్రమిస్తుంటే, కేవలం నలుగురు ఉన్నతాధికారులకే అవార్డులు పరిమితం చేయడంపై మిగిలిన అధికారులలో లోలోపలే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

రాజకీయ తిష్ట... కేడర్‌ లేని నేతల హల్‌చల్‌!

ప్రభుత్వ వేడుకగా జరగాల్సిన ఈ అధికారిక కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన పసుపు నేతల జోక్యం హద్దులు దాటింది. కేడర్‌, ఎలాంటి అధికారిక హోదా లేని నేతలు సైతం వీఐపీ గ్యాలరీల్లో తిష్ట వేసి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. తమ అనుచరులకు అవార్డులు ఇప్పించుకోవడానికి చివరి నిమిషం వరకు సిఫారసులతో హడావుడి చేశారు.

నిర్వహణ లోపం... అవమానంతో

వెనుదిరిగిన ఉత్తమ ఉద్యోగులు!

కలెక్టరేట్‌ అధికారుల పర్యవేక్షణా లోపం, సమన్వయలేమి పరేడ్‌ మైదానంలో స్పష్టంగా కనిపించాయి. ప్రశంసాపత్రాల అందజేతలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకరి పేరుకు మరొకరికి సర్టి ఫికెట్లు మార్చి ఇవ్వడం, పేర్లు తప్పుగా చదవడం వంటి ఘటనలతో అవార్డు గ్రహీతలు విస్తుపోయారు. జిల్లా స్థాయిలో దక్కే గుర్తింపు కోసం ఎంతో ఆశగా, కుటుంబ సమేతంగా వచ్చిన నిజమైన ఉత్తమ ఉద్యోగులకు తీవ్ర అవమానం ఎదురైంది. అధికారుల బాధ్యతారాహిత్యానికి నిరసనగా కొందరు ఉద్యోగులు తమకు కేటాయించిన ప్రశంసాపత్రాలను తీసుకోకుండానే వేదిక వద్ద నుంచి అసంతృప్తితో వెనుదిరిగారు.

ప్రతి ఏడాదీ ఎంతో అట్టహాసంగా సాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఏళ్లుగా చూస్తున్న పాటలు, అవే నృత్యాలు, అవే పాఠశాలల విద్యార్థులతో వేదికను కానిచ్చేశారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే వేలాది మంది గ్రామీణ విద్యార్థులకు వేదికపై అవకాశం దక్కలేదు. కళాత్మకత కంటే ప్రైవేట్‌ విద్యాసంస్థల పరోక్ష ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను పక్కనబెట్టి, కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల ప్రయోజనాల కోసం సాంస్కృతిక విభాగాన్ని వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు, శాఖల ప్రగతిని చాటే శకటాల ప్రదర్శనలోనూ ఎలాంటి కొత్తదనం కనిపించలేదు. గత ఏడాది ప్రదర్శించిన నమూనాలనే చిన్నపాటి మార్పులతో మళ్లీ తీసుకొచ్చి మమ అనిపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement