నగరి: మండలంలోని అడవికొత్తూరు గ్రామంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం అడవికొత్తూరులో పర్యటించిన ఆమె ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీశారు. వర్షం పడిన ప్రతిసారీ కొండ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు గ్రామంలోకి చేరి ఇళ్లలోకి ప్రవేశిస్తోందని, తమ ఇళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆమె వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు డ్రైనేజీ, సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులను ఎంపీపీ నిధులతో మంజూరు చేయించి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే అధికారిక అనుమతులు ఉన్నప్పటికీ సంబంధిత ఏఈ హరి పనులను అడ్డుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో పనులు ప్రారంభించిన తర్వాత కూడా వాటిని పూడ్చివేసి తిరిగి పనులు జరగకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. కలెక్టర్ ఆదేశాలే అమలు కాకపోతే ఇక అధికార వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుందని రోజా ప్రశ్నించారు. కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పనులను అడ్డుకుంటున్న అధికారిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. వర్షాకాలం తీవ్రత పెరగకముందే డ్రైనేజీ, సీసీ రోడ్డు, కల్వర్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో పేద ప్రజల ఇళ్లలోకి వర్షపు నీరు చేరే పరిస్థితిని కొనసాగనివ్వబోమన్నారు.
పేదల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పేదల సమస్యలను పట్టించుకోకుండా అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని పనులను అడ్డుకుంటున్న అధికారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. అడవికొత్తూరు ప్రజలకు న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భార్గవి, వైస్‌ఎంపీపీ కన్నియప్ప, స్థానిక నాయకులు భాస్కర్, వేలు, రోశమ్మ, యుగంధర్, గురురెడ్డి, ఏకాంబరం, తనికాచలం తదితరులు పాల్గొన్నారు.


