తిరుపతి ఎడ్యుకేషన్ : కొండారెడ్డి రాయలసీమ విద్యా సంస్థల అధినేత వై.కొండారెడ్డి శనివారం కన్నుమూశారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, మేధావులు, నగర ప్రజలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆరు దశాబ్దాలకుపైగా తన జీవితాన్ని విద్యారంగానికి అంకితం చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అలాగే ఫీజులు చెల్లించలేని ఎందరో పేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజన సదుపాయాలు కల్పించాని ప్రశంసించారు.
భూమన నివాళి
రాయలసీమ విద్యాసంస్థల అధినేత వై.కొండారెడ్డి మృతి చెందారన్న విషయం తెలుసుకున్న చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి శనివారం రాత్రి బైరాగిపట్టేడలోని తన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. కొండారెడ్డి తనయుడు ఆనందరెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.


