గంగవరం: మండలంలోని మదర్‌థెరిసా డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యా ర్థిని పవిత్ర అంతర్జాతీయ కరాటే పొటీలకు ఎంపికై నట్టు కళాశాల కరస్పాండెంట్ రవీంద్రబాబు శనివారం తెలిపారు. గతంలో మైసూరులో జరిగిన జాతీయ పోటీలో పాల్గొని విజయం సాధించడంతో పాటు వచ్చే సెప్టెంబర్ నెలలో జపాన్‌లో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్టు పేర్కొన్నారు. పుంగునూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న గణపతి కుమార్తె పవిత్ర తన 11వ ఏట నుంచి కరాటేలో ప్రతిభ కనబరుస్తూ అనేకసార్లు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించి అనేక పథకాలు సొంతం చేసుకోవడం జరిగిందన్నారు. గత ఏడాదిలో జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు వీలు కాలేదన్నారు. దీంతో జపాన్‌లో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనడం కోసం కళాశాల యాజమాన్యం తరఫున రూ.50వేలు విద్యార్థినికి అందించినట్టు తెలిపారు. ఈ విద్యార్థిని కళాశాల చైర్మన్ సునిల్, అకడమిక్ డైరెక్టర్ రాజేంద్రరెడ్డి, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రావు, అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు కలిసి అభినందించారు.


