శాంతిపురం: ఎమ్మెల్సీ, వైఎస్పార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త కెఆర్‌జె భరత్ వ్యక్తిగత సహాయకుడు జి.మురు గేష్‌ను రాళ్లబూదుగూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నాలుగు నెలల క్రితం మండలంలోని నంజంపేటలో దేవుడి ఉత్సవాల సందర్భంగా జరిగి న కబడ్డీ పోటీల్లో ఇద్దరి మధ్య రేగిన వివాదం ఇరు రాజకీయ పార్టీల ఘర్షణకు దారితీసింది. దీనికి సంబంధించి నమోదైన కేసులో మురుగేష్ ఏ6గా ఉన్నారు. సంఘటన జరిగిన సమయంలో తను నంజంపేటలో లేకున్నా ఉద్దేశపూర్వకంగా తనను కేసులో ఇరికించారని పరారీలో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం మురుగేష్ ప్రయత్నించారు. గురువారం రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలోని పోలీసు బృందానికి పట్టుబడ్డాడు. నిందితుడిని పోలీసులు కుప్పం కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి రిమాండుకు తరలించారు.
రాజకీయ వేధింపుల్లో భాగమే
కేవలం తన పీఏగా ఉన్నడన్న కారణంగానే రాజకీయ వేధింపుల్లో భాగంగా మురుగేష్‌పై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. అక్రమ కేసులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. గొడవ జరిగిన ప్రాంతంలో లేని వ్యక్తిపై కక్ష సాధింపు కోసమే కేసు నమోదు చేశారని చెప్పారు. గురువారం జరిగిన వాదనల తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేసిందన్నారు. అంతలోనే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. బాధితుడికి, అతని కుటుంబానికి పార్టీ, తాను పూర్తి అండగా ఉంటామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండించిన ఎమ్మెల్సీ వీటికి బాధ్యులైన వారు భవిష్యత్తులో చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.


