పుత్తూరు: మెడలోని బంగారు గొలుసును లాకెళ్లడానికి ప్రయత్నించిన యువకుడిని మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో పరారైన సంఘటన స్థానిక స్వర్ణ హౌసింగ్ కాలనీలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకొంది. మహిళ తెలిపిన వివరాల మేరకు.. కాలనీలో నివాసం ఉంటున్న యువసంధ్య(30) గత రెండేళ్లుగా ప్రొవిజన్ స్టోర్ నడుపుకుంటోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో 25 ఏళ్ల వయసున్న యువకులు ముగ్గురు మోటర్ సైకిల్‌పై వచ్చారు. అందులోని ఓ యువకుడు షాపు వద్దకు వచ్చి కూల్‌డ్రింక్ కావాలని అడిగాడు. మహిళ ఇవ్వడానికి వెనక్కు తిరగడంతో మెడలోని గొలుసును లాగడానికి ప్రయత్నించగా వెంటనే మహిళ అతని చేతిని బలంగా పట్టుకుంది. మరో చేతిలోని కత్తితో బెదిరించగా ఆమె దొంగ దొంగ అంటూ అరవడంతో దుండగుడు వదిలించుకుని వెళ్లే పెనుగులాటలో మహిళ కిందపడిపోయింది. దీంతో మోటర్ సైకిల్‌పై సిద్ధంగా ఉన్న మరో ఇద్దరితో కలసి పరారయ్యాడు. ఈ పెనుగులాటలో బంగారు గొలుసు ఆమె డ్రస్ లోపలే పడిపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కిందపడ్డ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించి వెళ్లారు.


