రెవెన్యూ కార్యాలయాల్లోని మాన్యువల్ రికార్డుల్లో అధికారులు ఇష్టానుసారంగా బోగస్ ఎంట్రీలు వేస్తున్నారు. హౌస్ సైట్ రిజిస్టర్‌లో జరిగే ఎంట్రీలే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం ఎవరైనా అర్హులకు ఇంటి పట్టాలు ఇవ్వడం సర్వసాధారణం. ఇంటి పట్టా ఇచ్చే వ్యక్తి పేరుని మాన్యువల్ రికార్డు నమోదు చేస్తారు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బోగస్ ఎంట్రీలను విచ్చలవిడిగా వేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలోనే తిరుపతి జిల్లా పరిధిలో విచ్చలవిడిగా బోగస్ ఎంట్రీలు జరిగినట్లు ఓ తహసీల్దార్ బయటి పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. చెరువు, కాలువ, కుంట పోరంబోకు స్థలాలను రూ.లక్షలు తీసుకుని బోగస్ పేర్లు నమోదు చేసి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బోగస్ ఎంట్రీలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం.


