ఆశాలంటే అందరికీ నిర్లక్ష్యమే | - | Sakshi
Sakshi News home page

ఆశాలంటే అందరికీ నిర్లక్ష్యమే

Aug 13 2026 1:21 AM | Updated on Aug 13 2026 1:21 AM

● ఆత్మహత్యాయత్నం చేసిన రాణి మృతి

క్షేత్ర స్థాయిలో ఆశావర్కర్లే కీలకం

వీరిపై పెత్తనం చెలాయిస్తున్న వైద్య సిబ్బంది

అందరి పనులు వీరికే కట్టబెడుతున్న వైనం

పని ఒత్తిళ్ల అనారోగ్య సమస్యలు

మెడికల్‌ ఆఫీసర్లకు చిన్నచూపు

వేధింపులు తాళలేక స్వచ్ఛందంగా తప్పుకుంటున్న వైనం

తాజాగా అధికారుల వేధింపులతో ఓ ఆశావర్కర్‌ ఆత్మహత్య

వి.కోట: మండలంలో ఎలుకల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆశావర్కర్‌ రాణి (27) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. అధికారుల వేధింపులు, తీవ్ర ఒత్తిళ్లే తన భార్య మృతికి కారణమని రాణి భర్త కేశవులు ఆరోపించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం మండలంలోని భారత్‌ నగర్‌ సచివాలయ పరిధిలో ఆశా వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న రాణి ఈ నెల 4 వ తేదీ రాత్రి ఎలుకల మందును పాలలో కలిపి తాగింది. వాంతులు చేసుకుంటుండగా గమనించిన భర్త ఆమెను హుటాహుటిన పట్టణంలోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఆస్పత్రికి, అటు తర్వాత వేలూరు సీఎంసీకి తరలించారు. సీఎంసీలో చికిత్స పొందుతూ బుధవారం రాణి మృతి చెందింది. తన భార్య ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. రాణి, కేశవులది ప్రేమ వివాహం కాగా, వీరికి ఇద్దరు మగ పిల్లలు.

18 నెలలు ఉచిత సేవలు

రాణి సేవా దృక్పథంతో గతంలో ఆశా వర్కర్‌గా చేరారు. అప్పటి రాజకీయ నేతల సిఫారసులతో ఆమెకు జీతం ఇవ్వకున్నా 18 నెలలు ఉచిత సేవలు చేశారని తెలిసింది. ఆపై రాజకీయ నేతల సిఫారసుతో వచ్చావని మెడికల్‌ ఆఫీసర్‌ రెండు నెలల జీతం ఇవ్వకుండా ఆపేశారని సమాచారం. ఈ నేపథ్యంలో రాణిపై వేధింపులు తప్పలేదు. ఆమెను ఎలాగైనా తొలగించాలనే విధంగా మొత్తం వ్యవహారం జరిగిందని సమాచారం.

కాగా, ఈ అంశంపై ఓగు పీహెచ్‌సీ వైద్యాధికారి వివరణ కోరగా సెలవు మంజూరుకానప్పటికీ రాణి మూడు రోజులు విహారయాత్రకు వెళ్లి విధులకు గైర్హాజరయ్యారని, దీనిపై అధికారులు ప్రశ్నించారని తెలిపారు.

ఆశా వర్కర్‌ రాణి సెల్ఫీ వీడియో

ఆశా వర్కర్‌ రాణి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ తనపై వేధింపులకు ఓగు పీహెచ్‌సీకి చెందిన ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌) నిత్య, మెడికల్‌ ఆఫీసర్‌ డా.మాధవిలే కారణమని తెలిపారు.

పలమనేరు: వైద్య శాఖకు సంబంధించిన అందరి పనులు ఆశా వర్కర్లకు అప్పగిస్తున్న తంతు గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. కానీ చిన్న ఉద్యోగులుగా ఉన్న వీరు వైద్య సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయోనని భయపడి ఎన్ని పనులు చెప్పినా చేస్తూనే ఉన్నారు. దీంతో వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, 104 వాహనాల సిబ్బంది ఆశా వర్కర్లతో అన్ని సర్వేలు, సేవలు చేయించుకుని వారేమో దర్జాగా ఉండగా.. కష్టాలేమో ఆశా వర్కర్లు పడుతున్నారు. జిల్లాలో అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది.

ఎందరో ఇలాంటి ‘ఆశా’లు

బైరెడ్డిపల్లి మండలంలోని రామనపల్లికి చెందిన ఓ ఆశా వర్కర్‌ గత పదేళ్లుగా ప్రజలకు సేవలందిస్తూ ఎంతో ఆదరాభిమానాలను చూరగొన్నారు. కానీ లక్కనపల్లికి చెందిన ఓ సూపర్‌వైజర్‌ ఆమెను టార్గెట్‌ చేసి తీవ్రమైన ఇబ్బందులకు గురిచేశారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆ ఆశావర్కర్‌ గుండెకు సంబంధించిన వ్యాధితో ఆస్పత్రికి చేరి లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆపై విధుల్లో చేరినా అదే సూపర్‌వైజర్‌ వేధింపులు తప్పలేదు. దీంతో కుటుంబ సభ్యుల సలహాతో స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఆపై అదే పంచాయతీలో ఆ ఆశావర్కరే కావాలనే ప్రజల డిమాండ్‌ నేపథ్యంలో మళ్లీ ఆమెకే అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కానీ ఇందుకు కారణమైన సూపర్‌వైజర్‌పై అక్కడి మెడికల్‌ ఆఫీసర్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్న వినిపిస్తోంది. కాగా ఇదే అంశంపై జిల్లా వైద్యశాఖ అధికారి కార్యాలయానికి ఈ పంచాయతీ చేరింది. అక్కడ కూడా మూర్తి అనే వ్యక్తి ఆశాలపై రాజకీయం చేస్తున్నాడనే ఆరోపణ వినిపిస్తోంది.

పలమనేరు నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల జనాభా ఉంది. ప్రతి వెయ్యి మందికి ఓ ఆశావర్కర్‌ చొప్పున 300 మంది ఆశావర్కర్లు ఇక్కడ ఉండాల్సి ఉండగా 280 దాకా ఉన్నట్టు తెలిసింది. క్షేత్ర స్థాయిలో గర్భవతులు, బాలింతలు, జ్వరాలు, రకరకాల సర్వేలు, మొత్తం వైద్య విభాగానికి చెందిన పనులన్నీ వీరే చేయాలి. దీంతోపాటు వైద్య సిబ్బంది, సచివాలయాల సిబ్బంది, 108, 104 ఇలా అందరి ఆన్‌లైన్‌ సర్వేలను ఆశా వర్కర్లే చేస్తున్నారు. ఈ కారణాలే ఆశా వర్కర్ల బాధలు, విరమణలు, చావులకు కారణమవుతోంది. ముఖ్యంగా సంబంధిత మండలాల మెడికల్‌ ఆఫీసర్లు వారి వైద్య సిబ్బందికి వత్తాసు పలుకుతూ ఆశా వర్కర్ల ద్వారా అన్ని పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కొత్తగా డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన నాగశశిభూషణ్‌ రెడ్డి పూర్తిస్థాయిలో విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement