సాక్షి టాస్క్‌ఫోర్స్: పచ్చని చిత్తూరు నేలపై అక్రమార్కుల కన్ను పడింది. పరిమితులు లేవు.. భయమూ లేదు.. చిత్తూరు మండలం ముత్తుకూరు కేంద్రంగా ఇసుక దోపిడీకి కొత్త దందాలు పురుడు పోసుకుంటున్నాయి. పాత స్థలంలోనే మళ్లీ ఇసుక డంప్‌ను ఏర్పాటు చేసి, సరిహద్దు దాటించేందుకు కూటమి నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముత్తుకూరుకు చెందిన ముగ్గురు నేతలు చేతులు కలిపి ఈ అక్రమ వ్యాపారాన్ని దర్జాగా నడిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నీకింత.. నాకింత..
ఈ ముగ్గురు నేతలు కలిసి నెలనెల నీకింత.. నాకింత.. అంటూ ముందస్తుగా సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పైన ఉన్న పెద్ద నేతల పేర్లు, కింద ఉన్న అధికారుల పేర్లు చెబుతూ ముత్తుకూరు వద్ద ఉన్న తచ్చూరు హైవే రింగ్ రోడ్డుకు సమీపంలోని పాత డంప్ స్థలంలోనే ఇసుక కుప్పలు పోసేశారు. మంగళవారం సాయంత్రానికే అక్కడ సుమారు 70 లోడ్ల ఇసుకను పోసి ఉంచారు. లారీలకు సులభంగా లోడ్ చేసేందుకు వీలుగా ఏకంగా పెద్ద గుంతను కూడా తవ్వి సిద్ధం చేయడం వీరి తెగింపునకు నిదర్శనం. ఈ ఇసుకనంతా అర్ధరాత్రి వేళ సరిహద్దు దాటించి తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకోవడానికి పక్కా స్కెచ్ వేశారు.
ముత్తుకూరు వద్ద ఇసుక డంప్
ఈ అక్రమ దందా వ్యవహారం ఆ నోటా ఈ నోటా పడి, అదే పార్టీలోని వ్యతిరేక వర్గం చెవిన పడింది. దోపిడీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ వర్గం నాయకులు వెంటనే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ స్థానిక అధికారులు స్పందించి ఈ అక్రమ డంప్‌పై చర్యలు తీసుకోకపోతే, ఏకంగా అధిష్టానానికే ఫిర్యాదు చేసేందుకు ఆ తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. మరి ఈ దందాపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారో అని వారు ఎదురుచూస్తున్నారు.
అధిష్టానానికి ఫిర్యాదుకు
సొంత వర్గం సిద్ధం


