పాతాళానికి గంగ | - | Sakshi
Sakshi News home page

పాతాళానికి గంగ

Aug 6 2026 2:38 AM | Updated on Aug 6 2026 2:38 AM

● జూలై ముగిసినా తగ్గని భానుడి భగభగలు ● దారుణంగా పడిపోయిన భూగర్భ జలాలు ● ఎండిపోతున్న పంటలు ● తాగునీటికీ తప్పని తిప్పలు

కాణిపాకం: జిల్లాలో ఈ ఏడాది వర్షాకాలంప్రారంభమైనా కనీస స్థాయిలో వర్షాలు కురవడం లేదు. నైరుతి రుతుపవనాలు మొండికేశాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అంతకంతకూ అడుగుంటుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సగటున 9.84 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు, ఏప్రిల్‌ నాటికి 12.93 మీటర్లకు, జూలై నాటికి ఏకంగా 15.15 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఈ ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే జలమట్టం ఏకంగా 5.31 మీటర్ల మేర దారుణంగా క్షీణించింది. మే నెలలో జిల్లాలో నమోదైన 83.77 మిమీల వర్షపాతం కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో నైరుతి రుతుపవనాలు విస్తరించకపోవడం పెద్ద దెబ్బతీసింది. జూన్‌ నెలలో 52.70 మిమీ వర్షపాతం నమోదుకాగా, జూలైలో 14.81 మిమీ అత్యల్ప వర్షపాతం నమోదైంది. మే నెలలో భూగర్భంలోకి చేరిన స్వల్ప నీరంతా భానుడి భగభగలు, విచ్ఛలవిడి వాడకానికి కరిగిపోయింది.

ఎండిపోతున్న పంటలు

జిల్లాలో చెరువులు, కాలువల కంటే ఎక్కువగా బోరు బావులపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. భూగర్భ జలాలు 15 మీటర్లకు పైగా లోతుకు వెళ్లడంతో వేలాది ఎకరాల్లో వేసిన మామిడి, పట్టు, కూరగాయలు, టమాటా, వేరుశనగ పంటలకు నీరు అందడం లేదు. జూలై ముగిసి ఆగస్టు ప్రారంభమైనా ఎండలు తగ్గకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. బోర్ల నుంచి నీరు సరిగా రాకపోవడం, లోవోల్టేజీ కారణంగా మోటార్లు తరచూ కాలిపోతుండడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. పడమటి మండలాలైన కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె పరిసర ప్రాంతాల్లో నీటి మట్టాలు 18 నుంచి 22 మీటర్ల లోతుకు పడిపోయినట్లు అధికారులు గుర్తించారు.

నెల వర్షపాతం భూగర్భమట్టం

ఫ్రిబవరి 0.22 9.84

మార్చి 9.38 10.96

ఏఫ్రిల్‌ 2.97 12.93

మే 83.77 13.82

జూన్‌ 52.70 14.24

జూలై 14.81 15.15

గత ఆరు నెలల వర్షపాతం, భూగర్భ జలమట్టాల వివరాలు

మరింతగా పడిపోయే అవకాశాలు

ఈ జలమట్టాల పతనం వ్యవసాయ రంగాన్నే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల తాగునీటి వ్యవస్థలను కూడా కుదిపేస్తోంది. అనేక గ్రామాల్లో రక్షిత మంచి నీటి పథకాల బోర్లు ఇంకిపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసి భూగర్భ జలాలు వృద్ధి చెందకపోతే తాగునీటికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైతులు సంప్రదాయ నీటి పారుదల పద్ధతులను పక్కనబెట్టి బిందు సేద్యం వైపు మొగ్గుచూపాలని, అలాగే చెక్‌ డ్యామ్‌ల పూడికతీత, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి జల సంరక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

జిల్లాలో ఎండలు తగ్గడం లేదు. జూలై ముగిసి ఆగస్టు ప్రారంభమైనా భానుడు భగభగమంటున్నాడు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో నీటి సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. గడిచిన ఆరు నెలల భూగర్భ జలమట్టాల గణాంకాలను పరిశీలిస్తే ఆందోళనకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వేసవి తీవ్రతతో పాటు వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు ఊహించని రీతిలో లోతుకు జారుకున్నాయి. బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement