చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి 12 వరకు జిల్లా స్థాయిలో అమరావతి ఛాంపియన్‌షిప్ –2026 క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ భాస్కర్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. గత నెల 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో జిల్లా స్థాయి క్రీడాపోటీలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన అథ్లెటిక్స్, యోగా, హాకీ, బాక్సింగ్, 11న కబడ్డీ, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, చెస్, 12వ తేదీన బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
డీసీసీబీకి ఉత్తమ
బ్యాంకింగ్ అవార్డు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక ఉత్తమ బ్యాంకింగ్ అవార్డు, రూ.2 లక్షల నగదు పురస్కారాన్ని దక్కించుకుంది. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఆప్కాబ్ 63వ ఫౌండేషన్ డే వేడుకల్లో, రాష్ట్రంలో ఉన్న 13 డీసీసీబీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. సహకార శాఖ రిజిస్ట్రార్ ఎ.అహ్మద్ బాబు, ఆప్కాబ్ చైర్మన్ వీరాంజనేయులు, ఎండీ ఆర్.వి.రామకృష్ణ చేతుల మీదుగా డీసీసీబీ సీఈఓ సి.శంకర్‌బాబు, చైర్మన్ అమాసరాజశేఖర్‌రెడ్డి అవార్డును అందుకున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని బి.కొత్తకోట, కలకడ, ఏర్పేడు, నాగలాపురం, ఐరాల ప్రాథమిక సహకార సంఘాలకు రూ.20 వేల ప్రోత్సాహక నగదు, అవార్డులను అందజేశారు.
ప్రశాంతంగా టెట్ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలకు ఉదయం, మధ్యాహ్నం 87.60 శాతం హాజరు నమోదైంది. జిల్లా వ్యాప్తంగా రెండు సెషన్‌లలో 718 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 629 మంది హాజరర్యారు. 89 మంది గైర్హాజరయ్యారు. కుప్పంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈవో లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు.
ఆలయ హుండీ ఆదాయం రూ.1.67 కోట్లు
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ.1,67,49,621 ఆదాయం వచ్చినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో అధికారులు, పాలక మండలి సభ్యుల సమక్షంలో బుధవారం హుండీలోని కానుకలను లెక్కించినట్టు తెలిపారు. ఇందులో రూ.1,67,49,621 నగదు, 25 గ్రాముల బంగారం, 410 గ్రాముల వెండి, గో సంరక్షణ హుండీ నుంచి రూ.28,973, నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.1,85,552 వచ్చినట్టు తెలిపారు. అలాగే యుఎస్‌ఏవీ డాలర్లు 828, యుఏఈ దిర్హమ్స్ 420, ఆస్ట్రేలియా డాలర్లు 260, యూరోలు 265, కువైట్ దీనార్లు 185, ఇంగ్లాండ్ పౌండ్లు 30, సౌదీ అరేబియా రియాళ్లు 20, కెనడా డాలర్లు 20, మలేషియా రింగిట్స్ 11, సింగపూర్ డాలర్లు 2 వచ్చినట్లు వెల్లడించారు. ఈ మొత్తం 21 రోజులకు వచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మణి నాయుడు, డీఈఓ సాగర్‌బాబు, ఏఈఓలు ఎస్.వి.కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనుంజయ, సీఎఫ్‌ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.


