జనగణన 2027 సన్నాహకాల్లో భాగస్వామ్యులు కావాలి మై భారత్ కార్యక్రమాలపై యువతకు విస్తృత అవగాహన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా జనాభా లెక్కల హ్యాండ్ బుక్ అత్యంత ప్రామాణికమైనదని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. ఆయన బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధమైన భవిష్యత్తు అభివృద్ధికి జనాభా లెక్కలు దోహదం చేస్తాయన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి రంగం సమగ్ర సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. జనగణన–2027 సన్నాహకాల్లో మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి విడతల వారిగా శిక్షణ ఇవ్వాలన్నారు. మున్సిపల్, విద్య, వైద్య ఆరోగ్య, హౌసింగ్, ఆర్ అండ్ బీ వంటి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో మోహన్ కుమార్, రాష్ట్ర సెన్సెస్ విభాగం ఏడీ సుప్రజ, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ లక్ష్మికళ తదితరులు పాల్గొన్నారు.
యువజన సాధికారతకు మై భారత్ దోహదం
యువజన సాధికారతకు మై భారత్ ఎంతో దోహదం చేస్తుందని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యువత కోసం నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా అవకాశాలను కల్పిస్తోందన్నారు. వీటిపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు. సమావేశంలో 2026–27 వార్షిక కార్యాచరణ ప్రణాళికపై చర్చించి, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించారు. సమావేశంలో జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్, ప్రోగ్రామ్ సూపర్‌వైజర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


