దగా డీఎస్సీపై సీబీఐతో విచారణ చేయించాలి మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి డిమాండ్ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
‘‘మెగా డీఎస్సీ అంటూ జబ్బలు చరుచుకున్నారు.. 16వేల ఉద్యోగాలని ఊదరగొట్టారు.. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఆర్భాటంగా ప్రకటించారు.. అయితే ఆశగా పరీక్షలు రాసిన నిరుద్యోగులను మోసం చేశారు.. పోస్టుల భర్తీలో అవినీతికి పాల్పడి అందరినీ బురిడీ కొట్టించారు.. కాసులకు కక్కుర్తి పడి అర్హులందరికీ టోపీ పెట్టేశారు.. ఈ క్రమంలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి.. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. బాధితులందరకీ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
చిత్తూరు కార్పొరేషన్ : దగా డీఎస్సీపై క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ నేతలు పోరాటం కొనసాగిస్తున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు మంత్రి లోకేష్ కూడా పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని స్పష్టం చేస్తున్నారు. అప్పటి వరకు పోరాడుతామని హెచ్చరిస్తున్నారు. అలాగే వసతిదీవెన, విద్యాదీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జిల్లాలోని నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున గడిచిన రెండేళ్లలో బకాయి మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌కు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, వైఎస్సార్‌సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త సునీల్‌కుమార్ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఉద్యోగుల, పెన్షనర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, ఎంపీపీ సంఘం రాష్ట్ర నేత రెడ్డెప్ప, చిత్తూరు నియోజకవర్గ యువత, విద్యార్థి విభాగాల అధ్యక్షులు మనోజ్‌రెడ్డి, సద్దాం, నేతలు త్యాగ, హరీషారెడ్డి, శశిదీప్, చక్రి, మురళి, మధురెడ్డి, రెడ్డిసాయి, స్టాండ్లీ, లోకేష్, హితీష్, రుత్విక్, గని, మణిరుధ్, శేఖర్, జయంత్, భాను పాల్గొన్నారు.
పాఠశాలలను మూసేస్తున్నారు
గత రెండేళ్లలోనే రాష్ట్రంలో 900 పైగా పాఠశాలలను మూసేశారు. 7 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేటు పాఠశాలలకు చేరారు. నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సమస్యలు తిష్ట వేశాయి. విద్యాదీవెన, వసతిదీవెన బకాయి రూ.కోట్లలో ఉంది. లంచం ఇవ్వనిదే పని జరగడం లేదని టీడీపీకి చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే రూ.లక్షలు చెల్లించాలి, ఇసుక దోపిడీతో పాలన అస్తవ్యస్తంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ పాలనలో విద్యావ్యవస్థ ఉన్నత స్థానంలో ఉంటే ప్రస్తుతం 13వ స్థానానికి పడిపోయింది. ఇప్పటికై నా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి.
– శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్


