చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో రేపటి నుంచి ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వినియోగదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ (ఎంఐపీ) ఆగస్టు 1వ తేదీ నుంచి జిల్లాలో అమలు కానుందన్నారు. రైతు బజార్లు, గుర్తించిన రైస్ మిల్ అవుట్‌లెట్‌లలో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పా టు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.52, స్టీమ్ బియ్యం (బీపీటీ) కిలో రూ.52, రా బియ్యం (బీపీటీ) కిలో రూ.50, సోనా మసూరి రకాల బియ్యం కిలో రూ.52 చొప్పున అందుబాటులో ఉంటాయని వివరించారు. ఆయా అవుట్‌లెట్‌లలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే విక్రయ కేంద్రాల వద్ద ధరల పట్టికలు, బియ్యం రకాలు, పని వేళలు, ఫిర్యాదుల నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సచివాలయాల ద్వారా విస్తతంగా ప్రచారం చేయాలని కోరారు.


