జ్వరోత్పాతం! | - | Sakshi
Sakshi News home page

జ్వరోత్పాతం!

Jul 31 2026 1:57 AM | Updated on Jul 31 2026 1:57 AM

● విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు ● ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు ● వారంలోనే వేలాది కేసులు ● చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

జిల్లాలో పూర్తిగా పడకేసిన పారిశుద్ధ్యం

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అరకొర వర్షాలకే పల్లెలు.. పట్టణాలనే తేడా లేకుండా పారిశుధ్యం పడకేయడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా జ్వరపీడితులు భారీ సంఖ్యలో మంచాన పడుతున్నారు. ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో అధికారులు వైఫల్యం చెందారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం పరిసరాల పరిశుభ్రతకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా దోమల నివారణలో విఫమవుతున్నారు. ఈ క్రమంలోనే డెంగీ రోగులు సైతం క్రమేణా పెరిగిపోతున్నారు.

కాణిపాకం : జిల్లావ్యాప్తంగా ప్రాథమిక స్థాయిలో వ్యాధులు ప్రబలకుండా అడ్డుకోవడంలో వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ శాఖల మధ్య సమన్వయం లోపించింది. ఫలితంగా జిల్లాలోని అధికారి గణాంకాల ప్రకారం వారం రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో 907 జ్వరం కేసులు నమోదైనట్లు చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. ప్రభుత్వ వైద్య కేంద్రాలపై నమ్మకం లేక, సౌకర్యాల కొరత కారణంతో ప్రజలు ఎక్కువగా ప్రైవేట్‌ ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం రోజుల్లోనే సుమారు 2 వేలకుపైగా ఫీవర్‌ కేసులు నమోదై ఉండవచ్చని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అధికారికంగా 34 డెంగీ కేసులు రికార్డయ్యాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్‌ఎంపీలు, చిన్న ప్రైవేట్‌ క్లినిక్‌లు, ల్యాబ్‌లలో నమోదవుతున్న డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా కేసులు అధికారిక లెక్కల్లోకి రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

నిధుల కొరత

పరిస్థితి ఇన్ని రకాలుగా క్షీణించడానికి పంచాయతీలకు ఏర్పడిన నిధుల సంక్షోభమే ప్రధాన కారణమని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం 15వ ఆర్థిక సంఘం నిధులను ఏప్రిల్‌లోనే పంచాయతీ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు పైసా కూడా విడుదల కాలేదు. మేజర్‌ పంచాయతీలు మినహా మిగిలిన చోట్ల సాధారణ నిధులు కూడా సున్నాకి చేరాయి. మరోవైపు, పారిశుద్ధ్య రక్షణలో కీలక పాత్ర పోషించే క్లాప్‌ మిత్రలకు పలు చోట్ల ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం వ్యవస్థను మరింత దెబ్బతీసింది. బ్లీచింగ్‌ చల్లేందుకు, చెత్త తరలించేందుకు కూడా గ్రామాల్లో డబ్బులు లేని దుస్థితి దాపురించింది. ప్రభుత్వం తక్షణమే పంచాయతీలకు పారిశుద్ధ్య నిర్వహణ నిధులు విడుదల చేయాలని, క్లాప్‌ మిత్రల వేతన సమస్యను పరిష్కరించి గ్రామాల్లో బ్లీచింగ్‌, ఫాగింగ్‌ డ్రైవ్‌ చేపట్టాలని జిల్లావాసులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో జ్వరాల బారిన పడి పెద్దసంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా సమాచారం

జిల్లా ఆస్పత్రి 01

ఏరియా వైద్యశాలలు 04

సీహెచ్‌సీలు 07

అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు 15

పీహెచ్‌సీలు 50

ప్రైవేటు హాస్పిటళ్లు సుమారు 1,000

దోమలకు కేరాఫ్‌ అడ్రస్‌

పల్లెలు, పట్టణ పరిధిలోని మురికివాడల్లో పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా తయారైంది. రోడ్లపై మురుగు నీరు నిల్వ ఉండడం, డ్రెయిన్లలో పూడిక తీయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దోమల నివారణకు వాడాల్సిన ఫాగింగ్‌ మిషన్లు పంచాయతీ కార్యాలయాల్లో మూలన పడి తుప్పు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో చూడాల్సిన సిబ్బంది, ప్రత్యేక అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement