చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల సంఖ్యను గత సంవత్సరం కంటే ఈ ఏడాది రెట్టింపు చేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జయప్రకాష్ నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం డీఈవో కార్యాలయం నుంచి పీసీఆర్ ప్రభుత్వ పాఠశాల వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీసీఆర్ పాఠశాలలో ఏఐ కోఆర్డినేటర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు పొందే అభ్యర్థుల దరఖాస్తులు ప్రారంభ దశ నుంచి ప్రతి కోఆర్డినేటర్ అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రాంలో అభ్యర్థులకు కనీసం 30 తరగతులకు తగ్గకుండా నిర్వహించాలన్నా రు. ట్యూటర్ మార్క్ అసైన్‌మెంట్లు, అసెస్మెంట్ పరీక్షలను ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా అమలు చేయాలన్నారు. విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అందించి, జిల్లాలో ఓపెన్ స్కూల్ ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. అడ్మిషన్ల ప్రత్యేక డ్రైవ్‌లో కోఆర్డినేటర్లు, సిబ్బంది అందరూ తమ పరిధిలోని గ్రామాలను సందర్శించాలన్నారు. డ్వాక్రా మహిళా గ్రూపులను కలిసి ఓపెన్ స్కూళ్లపై అవగాహన కల్పించాలని సూచించారు. చదువు మధ్యలో ఆపేసిన వారి వివరాలు సేకరించి, వారిని తిరిగి ఓపెన్ స్కూల్ లో చేర్పించి విద్యావంతులను చేయాలన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు డీవైఈవో ఇందిర, గంగవరం జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం చంగల్‌రెడ్డి, విద్య కళాశాల కరస్పాండెంట్ నవీన్, విజ్ఞానజ్యోతి కళాశాల కరస్పాండెంట్ జానకిరామరెడ్డి, పలువురు ఏఐ కోఆర్డినేటర్ పాల్గొన్నారు.


