పోరాటం ఆపేది లేదు | - | Sakshi
Sakshi News home page

పోరాటం ఆపేది లేదు

Jul 11 2026 12:42 AM | Updated on Jul 11 2026 12:42 AM

కలెక్టరేట్‌ వద్ద కదం తొక్కిన అంగన్‌వాడీలు నవచేతన యాప్‌ రద్దు చేయాలని డిమాండ్‌ నల్లచీరలు కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన పోలీసుల అడ్డగింత, అయినా వెనక్కు తగ్గని అంగన్‌వాడీలు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా

చిత్తూరు కలెక్టరేట్‌ : అంగన్‌వాడీల సమస్యలు, ఇచ్చి న హామీలను నెరవేర్చేంత వరకు పోరాటం ఆపేది లేదని అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు లలిత హెచ్చరించారు. ఆల్‌ ఇండియా కమిటీ పిలుపు మేరకు కోర్కెల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బ్లాక్‌ డే నిరసనలో కలెక్టరేట్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో వందలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. అంగన్‌వాడీలు కలెక్టరేట్‌ లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్ల వద్దే అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కలెక్టరేట్‌ ఎదుటే అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు ధర్నా నిర్వహించారు.

11 ఏళ్లుగా ఒక్క రూపాయి పెంచలేదు

ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయు) గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ఒక్క రూపాయి వేతనం పెంచకుండా అంగన్‌వాడీలతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని విమర్శించారు. ఐసీడీఎస్‌ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం దారుణమన్నారు. ఆకాశాన్నంటుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పనిభారంగా మారిన ‘నవచేతన యాప్‌’ను తక్షణమే రద్దు చేయాలన్నారు.

ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి

అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షకీల, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు విజయ, గిరిధర్‌గుప్త మాట్లాడుతూ ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో శిబిరాల వద్దకు స్వయంగా వచ్చి హామీలు ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని నమ్మబలకడంతో అంగన్‌వాడీలంతా నమ్మి ఓట్లేసి గెలిపించారన్నారు. అయితే, అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దుర్మార్గమన్నారు.‘ఏరు దాటే వరకే మల్లన్న– ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న’ అన్న చందంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో అంగన్‌వాడీల పోరాటాన్ని అణచాలని చూసినందుకే చంద్రబాబును ఇంటికి పంపిన చరిత్ర ఉందని, మళ్లీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

జిల్లా సమస్యలను పరిష్కరిస్తాం: కలెక్టర్‌ హామీ

ధర్నా అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తల ప్రతినిధులు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రీ–స్కూల్స్‌ బలోపేతం పేరుతో అంగన్‌వాడీలను పాఠశాలల దగ్గరకు మార్చడం వల్ల అదనపు భారం పడుతోందని, దీనిని తగ్గించాలని కోరగా.. జిల్లా పరిధిలో ఉన్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అనంతరం ఐసీడీఎస్‌ పీడీ వెంకటేశ్వరిని కలిసి ప్రాజెక్టుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ‘జిల్లా సమన్వయ కమిటీ’ ఏర్పాటు చేయాలని కోరగా, అందుకు పీడీ సానుకూలంగా స్పందించి కమిటీ ఏర్పాటుకు అంగీకరించారన్నారు. ఈ ధర్నాలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు సుజిని, మమత, లక్ష్మి, రాధిక, పద్మ, పద్మమ్మ, అనిత, శ్యామలమ్మ, ధనకోటి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement